Just In





Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
Vijaya Sai Reddy Latest News:వైసీపీకి విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి రావద్దని అనేలా మీడియాలో లెఫ్ అండ్ రైట్ ఇచ్చేశారు.

Vijaya Sai Reddy Latest News: "వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మనసులో తాను లేనన్న విషయం తెలియగానే మనసు విరిగిపోయిందని వైసీపీలో తను ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్ది కొంతమంది ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జగన్ చుట్టూ ఒక కోటరీ లా తయారయ్యారని " వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతున్న టైంలో అధినాయకత్వంపై ఎలాంటి విమర్శలు చేయని సాయి రెడ్డి విజయవాడలో సిఐడి ముందు విచారణకు హాజరైన సమయంలో మీడియా ముందు తన వేదనంతా బయట పెట్టేశారు. కాకినాడ పోర్టులో వాటాలను విజయసాయిరెడ్డి, అల్లుడి సోదరుడు శరత్ చంద్రరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి బలవంతంగా లాగేసుకున్నారని పోర్టు యజమాని KV రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు పెట్టి సీఐడీ నోటీసులు అందజేసింది. మొదట్లో చంద్రబాబు నాయుడిపై విజయ సాయిరెడ్డి నిప్పులు చెరిగారు.
అది గతం ఇప్పుడు ఆయన వైసీపీ మాజీ నేత. అందుకే కానీ బుధవారం విచారణకు హాజరైన తర్వాత ఆయన శైలి మారిపోయింది. ప్రధానంగా వైసిపి హైకమాండ్‌ని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
జగన్ చెప్పుడు మాటలు వింటున్నారు, కోటరీ కమ్మేసింది : విజయసాయి రెడ్డి
కాకినాడ పోర్టు వివాదంలో తన పాత్ర లేదని చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. వాళ్లు అమెరికా వెళ్ళినప్పుడు కేసు వేసిన కె.వి రావు ఇంట్లోనే ఉండేవారిని ఆరోపించారు విజయసాయిరెడ్డి. అలాగే ఈ కేసుకు సంబంధం లేని మద్యం స్కాంపై కూడా మాట్లాడుతూ అప్పటి జగన్ ప్రభుత్వం అడ్వైజర్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవహారం నడిచిందని బాంబు పేల్చారు. ఆ కేసులో కూడా విజయసాయిరెడ్డి సహా వైసీపీకి చెందిన చాలా ముఖ్యమైన వాళ్ళ పేర్లు ఉన్నాయి. దీనిపై సిట్ వేశారు ప్రస్తుతం విచారణ సాగుతోంది. త్వరలోనే కొన్ని పెద్ద తలకాయల అరెస్టులు తప్పవని అంటున్నారు.
వైసీపీ నుంచి ఎవరైనా తనపై విమర్శలు చేస్తే చాలా విషయాలు మాట్లాడతా అంటూ విజయసాయిరెడ్డి వార్నింగ్ పంపించారు. దీనితో విజయసాయిరెడ్డి త్వరలో అప్రూవర్‌గా మారతారా అంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. విచిత్రంగా సాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ నుంచి పెద్ద లీడర్లు ఎవరూ ఇంతవరకూ స్పందించలేదు. దాంతో విజయసాయి రెడ్డి దగ్గర పార్టీకి చెందిన చాలా రహస్యాలు ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
జగన్ నేను భయపడ్డాను అన్నారు:విజయ సాయి రెడ్డి
పార్టీ వదిలి తాను వెళ్తాను అన్నప్పుడు "తనకు విశ్వసనీయత లేదని, భయపడ్డానని, ప్రలోభాలకు లొంగి పోయానని " జగన్ అన్నారు. కానీ తనకు అలాంటివేవీ లేవని.. సిబిఐ,ఈడీ కేసులు ఉన్నా భయపడలేదని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. జగన్ చుట్టూ ఏర్పడిన కోటరీ ఆయనకు వాస్తవాలు తెలియకుండా చేస్తుందని ఆరోపించారు. నాయకుడు చెప్పుడు మాటలు వినడం మొదలుపెడితే పార్టీకి ప్రజలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. గత మూడున్నర ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూ వచ్చానని సాయిరెడ్డి అన్నారు.
సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి &కోను ఉద్దేశించి విజయ సాయిరెడ్డి ఈ కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. విజయ సాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డిని పంపించారు. ఢిల్లీలోనూ వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం సజ్జలదే హవా కావడం తనను దూరం పెట్టారనేది విజయసాయి రెడ్డి అభిప్రాయం. అధినాయకుడు జగన్ దగ్గరే తనకు విలువ లేదని తెలిసి మనసు విరిగిపోయిందని ఆయన మొదటిసారిగా మీడియా ముందు బాధ వెళ్లబుచ్చారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలోనే విజయ సాయి రెడ్డి తనపై నమోదైన కేసుల్లో అప్రూవర్‌గా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అదే గనుక జరిగితే వైసీపీలో పెద్ద తలకాయలకు చాలా ఇబ్బందులు తప్పవని అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.