AP New Year Restrictions : ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేక్ లు కట్ చేసి హడావుడి చేయడంపై ఆంక్షలున్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఓ ప్రకటనలో తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరిచి ఉండకూడదని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డీజేలకు అనుమతి తప్పనిసరి చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వాహకులు, క్లబ్లు, పబ్ ల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని సీపీ చెప్పారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించుకుని 1 గంట కల్లా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుందని సీపీ సూచించారు. విజయవాడ నగరంలో శనివారం అర్ధరాత్రి నుంచి సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు చేయనున్నామని వెల్లడించారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వేడుకల పేరుతో రాత్రుళ్లు ప్రజలు రోడ్లపై తిరగవద్దని సూచించారు. కరోనా కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా తెలిపారు.
విశాఖలో ఆంక్షలు
విశాఖలోనూ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్కే బీచ్ రోడ్‌లోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. స్టార్ హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట వరకే నిర్వహించాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దొరికితే నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తామని విశాఖ సీపీ హెచ్చరించారు. నగరంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో నగరంలోని అన్ని ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విశాఖ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు.
- డ్రగ్స్ వినియోగించి పట్టుబడితే పార్టీ నిర్వాహకులపై కూడా కేసు నమోదు
- జిగ్ జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ , సైలెన్సర్ లేకుండా పెద్ద శబ్దాలు చేస్తే కేసు నమోదు
- బీచ్ లో బాణాసంచా కాల్చడం నిషేధం
- డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలు ఇస్తే పిల్లలతో పాటు వాహన యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు
- హెల్మెట్ లేకుండా మోటార్ సైకిళ్లపై ప్రయాణించడం ప్రమాదం, నేరం కూడా. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు
- వాహనాలను అనుమతి లేని ప్రదేశాల్లో పార్కింగ్ చేయకూడదు. అలా పార్కింగ్ చేస్తే వాహనాలను టోయింగ్ చేసి కేసు నమోదు చేస్తారు