విజయవాడ నోవాటెల్ హోటల్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన ఘటనపై సంఘీభావం తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.  చంద్రబాబు మాట్లాడుతూ.."విశాఖలో పవన్‌ కల్యాణ్‌పై ప్రభుత్వం అనుసరించిన తీరుపై బాధతో ఒకసారి కలిసి సంఘీభావం చెప్పాలనుకున్నాను. అందుకే నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వచ్చాను. వచ్చే వరకు ఎవరికీ చెప్పలేదు. రెండు పార్టీలకు చెందిన లీడర్లు ఎదురుపడే టైంలో పోలీసులు మేనేజ్‌ చేయాలి. పవన్‌ విశాఖలో దిగినప్పటి నుంచి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టారు. దారిలో లైట్లు మొత్తం ఆపేశారు. కావాలనే ఓ ఆఫీసర్ ఇబ్బంది పెట్టాడు. రాత్రంతా భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆయనేం రాష్ట్ర పౌరుడు కాదా? విశాఖ వెళ్లడానికి ఆయనకు అర్హత లేదా? ఆయన విశాఖలో ఉంటే వచ్చే శాంతి భద్రత సమస్య ఏంటి." అని ప్రశ్నించారు.  



పోలీసుల తీరు దారుణం 


"మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఇలాంటి టైంలో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. దాడి చేయడం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం. మళ్లీ నిందితులే తిరిగి పెట్టడం అలవాటైపోయింది. మనుషులను నిర్వీర్యం చేయడానికి ఎన్ని తిట్టాలో అన్ని తిడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడతారు. మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఎప్పుడూ చూడని రాజకీయం ఇది. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యమైంది. ప్రజలకు, మీడియాకు ఎవరికీ స్వేచ్ఛ లేదు. వీళ్ల హింస తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంత నీచమైనా దారుణమైన పార్టీని ఇంత వరకు చూడలేదు. మా పార్టీపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. ముందు రాజకీయ పార్టీల మనుగడకాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని పార్టీలు చెప్పలేకపోతే ఎవరు చెప్తారు. పవన్ మీటింగ్ పెట్టడం తప్పా? మమ్మల్ని బాధ పెడితే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అవసరమైతే మళ్లీ కలుస్తాం. ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా కర్తవ్యం. కొందరు పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా పర్యటనలు చేస్తే నిర్బంధిస్తారా? ఇది మంచి పద్దతి కాదు."- చంద్రబాబు 


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం 


"ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తాం. సమస్యలు ఉన్నా కబ్జాలు చేస్తున్నా అడిగే ధైర్యం ఏపీలో ఎవరికైనా ఉందా? అందుకే ఈ పోరాటానికి పిలుపునిచ్చాం. ఇంత ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నాకే ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. అన్యాయం జరిగిన వారి తరఫున మాట్లాడే బాధ్యత మాకు ఉంది. అందుకే దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది."- చంద్రబాబు 


వైసీపీ ముక్త ఏపీ కోసం పవన్ ప్రచారం 


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ మళ్లీ గెలవడకూడదని..వైసీపీ విముక్త ఏపీ కావాలని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం తాను ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. ఓ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి బీజేపీని రూట్ మ్యాప్ అడిగానని చెప్పారు. అయితే ఉదయం మీడియాతో మాట్లాడిన సమయంలో బీజేపీ ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్నాం కానీ బలంగా కలిసి వెళ్లలేకపోయామన్నారు. ప్రభుత్వంపై పోరాడలేకపోయామన్నారు. మోదీ అంటే గౌరవం ఉంది కానీ బానిసత్వం మాత్రం లేదన్నారు. ఇలా బీజేపీ పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం .. కాసేపటికే..  నోవాటెల్ హోటల్లో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో రాజకీయంగా ఊహాగానాలు రావడానికి కారణం అవుతోంది.