President Droupadi Murmu : తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతికి విజయవాడలో పౌర సన్మానం చేశారు. రాష్ట్రపతి ముర్మును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని, అందుకే హిందీలో మాట్లాడుతున్నానన్నారు. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు అంటూ ద్రౌపదీ ముర్ము తెలుగులో మాట్లాడారు.  వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ నేలపైకి రావడం ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయన్నారు. కూచిపూడి నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎన్నడూ మర్చిపోలేమన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి వచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.






ఏపీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది 


 తిరుమల బాలాజీ ఉన్న పవిత్ర స్థలానికి రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడన్న రాష్ట్రపతి ... ఏపీకి చెందిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తుచేశారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌, ఇలా పలువురి పేర్లను ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఏపీని పునీతం చేస్తున్నాయన్నారు. ఏపీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు.  నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రఖ్యాతిగాంచాయన్నారు. 


గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం ఎంతో గర్వకారణం - సీఎం జగన్ 


దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ ఎంతో గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీకి వచ్చిన ద్రౌపదీ ముర్మును గౌరవించుకోవడం అందరి బాధ్యతగా భావించి పౌర సన్మానం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల కోసం ద్రౌపదీ ముర్ము ఎంతో కృషి చేశారని సీఎం జగన్ అన్నారు. జీవితంలో ద్రౌపదీ ముర్ము ఎన్నో కష్టాలు పడినా చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిపోయారన్నారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నామని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్ అన్నారు. ఏపీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలుగు భాషకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కీర్తించారని గవర్నర్ తెలిపారు.  


రాజ్ భవన్ లో విందు 


పౌరసన్మానం అనంతరం విజయవాడ రాజ్‌భవన్‌కు ద్రౌపదీ ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ రాజ్ భవన్ లో స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌  ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు.