Devineni Uma Vs Avinash : బెజ‌వాడ టీడీపీలో ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌టన చోటుచేసుకుంది. స్వయాన బాబాయ్ అయిన దేవినేని ఉమా, త‌న కొడుకు వ‌రుసయ్యే దేవినేని అవినాష్ కు శాపనార్దాలు పెట్టారు. అవినాష్ రాజ‌కీయ జీవితం అయిపోయింద‌ని హెచ్చరించారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గెల‌వ‌ర‌ని, టీడీపీ త‌ర‌పున గ‌ద్దె రామ్మోహ‌న్ గెలుపు సాధిస్తార‌ని కూడా దేవినేని ఉమా జోష్యం చెప్పారు. ఈ సంఘ‌ట‌న పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చకు దారితీసింది. 


బాబాయ్, అబ్బాయ్ మధ్య రాజకీయ వివాదం 


బెజ‌వాడ రాజ‌కీయం ఆస‌క్తికరంగా మారింది. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీల్లో ఉన్న నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ చిచ్చుచెల‌రేగింది. అది కూడా బాబాయ్, అబ్బాయ్ ల మ‌ధ్య రాజ‌కీయ వివాదం కావ‌టం విశేషం. ఈ అంశం ఇప్పుడు రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు అంటే తెలియ‌నివారు లేరు. మొన్నటి వ‌ర‌కు టీడీపీలో ఉండి, గత ఎన్నికల్లో గుడివాడ‌లో వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ ఇప్పుడు వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన  విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ బాధ్యత‌ల‌ను నిర్వర్తిస్తున్నారు. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఘ‌ట‌న‌లు అవినాష్ కు ఇబ్బందిక‌రంగా మారాయి. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ నేత‌లు దాడి చేశారు. అదే విధంగా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడి జ‌రిగింది. ఇప్పుడు తాజాగా అదే నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యద‌ర్శిగా ఉన్న చెన్నుపాటి గాంధీపై కూడా దాడి జ‌రిగి, ఆయ‌న క‌న్నుకు తీవ్రగాయం అయింది.  


దేవినేని అవినాష్ అనుచరుల హస్తం! 


ఈ వివాదాల్లో దేవినేని అవినాష్ తో పాటు ఆయ‌న అనుచ‌రుల హ‌స్తం ఉంద‌నేది టీడీపీ నేతల వాదన. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టం, పార్టీ కార్యక‌ర్తల‌కు నాయ‌కులు భ‌రోసా క‌ల్పించ‌క‌పోవ‌టం, పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిందంటూ ఇటీవ‌ల చంద్రబాబు స్వయంగా నాయ‌కుల‌కు హెచ్చరిక‌లు జారీ చేశారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయ‌కులు విజ‌య‌వాడ కేంద్రంగా విస్తృత స్థాయి స‌మావేశాన్ని నిర్వహించారు. ఈ స‌మావేశానికి జిల్లా పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఇదే వేదికపై అవినాష్ కు దేవినేని ఉమా హెచ్చరిక‌లు జారీ చేశారు. "అవినాష్ రాజ‌కీయ భ‌విష్యత్ అయిపోయింది, త‌ల్లి లాంటి పార్టీ కార్యాల‌యంపై దాడి చేయించావు. పార్టీ నాయ‌కులపై దాడి చేయించి, వారి క‌న్ను పోగొట్టావు. నియోజ‌క‌వ‌ర్గంలో నీకు టీడీపీ అభ్యర్థిగా ఉన్న గ‌ద్దె రామ్మోహ‌న్ చేతిలో ప‌రాజ‌యం త‌ప్పద‌ు" అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.


 దేవినేని నెహ్రూ వార‌సుడిగా అవినాష్


కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయ‌కుడిగా వ్యవ‌హ‌రించిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ త‌న‌యుడు దేవినేని అవినాష్. దేవినేని నెహ్రూ కూడా మొదట నుంచి టీడీపీలోనే కొన‌సాగారు. ఆ త‌రువాత పార్టీలో విభేదాలు కార‌ణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత నెహ్రూ కుటుంబం రాజీక‌యంగా పై చేయి కోసం ప్రయ‌త్నించింది. అయితే టీడీపీ అధికారంలోకి రావ‌టంతో నెహ్రూ కుటుంబం సైలెంట్ అయ్యింది. ఆ త‌రువాత నెహ్రూ మ‌ర‌ణంతో ఆయ‌న కుమారుడు దేవినేని అవినాష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మ‌ధ్య జ‌రిగే రాజ‌కీయ పోరులో బాబాయ్ , అబ్బాయ్ మ‌ద్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. 


Also Read : TDP Meeting : త్రీ ఇడియట్స్ కు త్వరలోనే బుద్ధి చెబుతాం, టీడీపీ సమావేశంలో నేతల హాట్ కామెంట్స్


Also Read : Ragurama letter To Amit Shah : ఏపీ సర్కార్‌ది కోర్టు ధిక్కరణ - రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ !