Vijayawada News : విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలను మంత్రులు పరామర్శించారు. బాధితురాలిని హోంమంత్రి తానేటి వనిత, విడదల రజనీ, జోగి రమేష్ పరామర్శించారు. దోషులను విడిచిపెట్టేది లేదని మంత్రుల స్పష్టం చేశారు. మంత్రుల పరామర్శ సమయంలో టీడీపీ నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన ఘోరాలు మరిచిపోయారా అని మంత్రి విడదల రజనీ అన్నారు. 


బాధితులను ఆదుకుంటాం : తానేటి వనిత 


పరామర్శ అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. "బాధితులు దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అది కోర్టు పరిధిలో ఉంటుంది. దిశ చట్టం అమల్లో ఉంటే బాధితులకు 24 గంటల్లో న్యాయం జరిగేది. కానీ అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీఎం గారు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇప్పుడు చెక్ అందించాం. బాధితులు ఇళ్ల లేదని వేడుకున్నారు. ఇందుకు మంత్రి జోగి రమేష్ స్పందించి ప్రభుత్వం తరఫున ఇళ్లు కేటాయిస్తామన్నారు"  అని అన్నారు.


యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. 


చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ మధ్య వాగ్వాదం 


అంతకు ముందుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అత్యాచారం బాధితురాలని పరామర్శించారు. వాసిరెడ్డి పద్మ పరామర్శకు వచ్చినప్పుడు ఆందోళన నెలకొంది. ఆ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి రాగా టీడీపీ శ్రేణులు వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరామర్శ సమయంలో చంద్రబాబు, వాసిరెడ్డి పద్మకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు, బోండా ఉమా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. 


బోండా ఉమాకు వార్నింగ్ 


వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..."బోండా ఉమా వంటి ఆకు రౌడీలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఆసుపత్రిలో బాధితురాలి ముందు రాజకీయం చేశారు. చంద్రబాబు ప్రోద్బలం లేకుండా బోండా ఉమా ఇంతలా రెచ్చిపోయాడా. బోండా ఉమా విజయవాడలో ఎక్కడ నిలబడిన ఓడించి తీరుతామన్నారు. మహిళా ఛైర్ పర్సన్ ను పట్టుకుని బూతులు తిట్టారు. కండకావరంతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా. " అన్నారు.