Minister Jogi Ramesh :  పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన అసమర్థుడు వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారని పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. విజయవాడలో మాట్లాడిన ఆయన ఇడుపులపాయలో హైవే అంటూ పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. పవన్ ప్రజలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రెక్కీ, రాళ్ల దాడి, ఇప్పటం అంటూ జనసేన, టీడీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటంలో ఒక్క ఇళ్లు కూడా కూల్చలేదని మంత్రి అన్నారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పనులపై గ్రామస్థులు సంతోషంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకూ రెక్కీ అంటూ డ్రామాలు ఆడారని తెలంగాణ పోలీసులు అలాంటిది ఏంలేదని తేల్చి చెప్పేసరికి మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. చంద్రబాబు వీకెండ్ లో అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తే, పవన్ అమరావతికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. 


ఇప్పటంలో పార్ట్ -3 డ్రామా 


ఇడుపులపాయలో హైవే వేస్తారా? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిగింది అన్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని  మంత్రి జోగి రమేష్ విమర్శించారు.  ఇప్పటం పేరుతో పార్ట్ 3 డ్రామా మొదలుపెట్టారని మంత్రి ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు నిజంగా దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసి చూపించాలని సవాల్ చేశారు. సీఎం జగన్ ను చూసి భయపడుతున్నారు కాబట్టే పొత్తులు అంటున్నారన్నారు. జగన్ పై  విమర్శలు చేసే నైతిక హక్కు పవన్ కు లేదని జోగి రమేష్ అన్నారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా కేవలం  ప్రహరీ గోడలు మాత్రమే పగలగొట్టారని, ఒక్క ఇళ్లు కూడా కూల్చలేదన్నారు. ఇళ్లు కూల్చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కూల్చివేతలకు గ్రామస్థులు సహకరిస్తుంటే పవన్ కు ఎందుకు ఏడుపు అంటూ జోగి రమేష్ ప్రశ్నించారు. ఒక వర్గాన్ని ఒక కులాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. 


తెర వెనుక రాజకీయాలు 


పవన్ కల్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు ట్వీట్లు చూస్తేంటే ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా వ్యవహారం ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం లేదా గాజువాక నుంచి ఎవరి మద్దతు లేకుండా గెలుస్తానని చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. తానే సీఎం అభ్యర్థి అని చెప్పుకునే ధైర్యం పవన్ కు ఉందా అని జోగి రమేష్ నిలదీశారు. సీఎం జగన్ ను చూసి భయంతో చంద్రబాబు, పవన్ కలిసి కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన కలిసి తెర చాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చినా వైసీపీని ఇంచు కూడా కదలించలేరని మంత్రి జోగి రమేష్ అన్నారు.


Also Read : కొట్టుకోండి, అరెస్టు చేసుకోండి, చంపుకోండీ మాకు ఓకే- పోలీసులపై పవన్‌ ఆగ్రహం