Moola Nakshatra : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (అక్టోబర్ 2) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు.  రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. దసరా నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజుల్లో మూలా నక్షత్రం ఒకటి. కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఈ రోజున అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తుంటారు.  


అర్ధరాత్రి నుంచి దర్శనాలు 


శనివారం అర్ధరాత్రి 1.30 నుంచి మూలా నక్షత్ర దర్శనాలు ప్రారంభిస్తామని విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 100, 300, 500 రూపాయల దర్శన టికెట్లు విక్రయాలు నిలిపివేశామన్నారు. దాతలకు మూడు వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్దులు, వికలాంగులకు మాత్రం రేపు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 మధ్య సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దసరా నవరాత్రుల వేళ భక్తులందరికీ దర్శనాలు కల్పిస్తున్నట్లు నగర సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నేటి రాత్రి 12.30 నుంచి పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు.  


ట్రాఫిక్ ఆంక్షలు


మూలానక్షత్రం రోజున అనగా అక్టోబర్ 1 రాత్రి నుంచి 02వ తేదీ రాత్రి వరకు ఆర్.టి.సి/సిటీ బస్సులు ఇబ్రహీంపట్నం వైపునకు (కనక దుర్గా ఫ్లైఓవర్ మీదుగా) కాళేశ్వరరావు మార్కెట్ వైపు అనుమతించరు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ - పి.సి.ఆర్ - చల్లపల్లి బంగ్లా - ఏలూరు లాకులు - బుడమేరు వంతెన - పైపుల రోడ్ - వై.వి. రావు ఎస్టేట్ - సి.వి.ఆర్. ఫ్లై ఓవర్ - సితార - గొల్లపూడి వై జంక్షన్- ఇబ్రహీంపట్నం మీదుగా ఆర్టీసీ, సిటీ బస్సులు మళ్లించారు.  మూలా నక్షత్రం రోజున అక్టోబర్ 1వ తేదీ రాత్రి నుంచి  2వ తేదీ ఉదయం వరకు ప్రకాశం బ్యారేజి మీద ఎటువంటి వాహనాలు అనుమతించరు.  అక్టోబర్ 5 రాత్రి వరకు సిటీలో తిరిగే వాహనదారులు  కనక దుర్గా ఫ్లైఓవర్ మీద నుంచి లేదా చిట్టినగర్ టన్నల్ నుంచి గాని భవానిపురం వైపు వెళ్లాల్సి ఉంటుంది. కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్, ఘాట్ రోడ్ నుంచి కుమ్మరిపాలెం వైపునకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. 


Also Read : Navratri 2022: అజ్ఞానాన్ని తొలగించే ఆరో దుర్గ కాత్యాయని, నవరాత్రుల్లో ఆరవ రోజు కాత్యాయనీ అలంకారం


Also Read : శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు