శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్‌లో ఆయన మాట్లాడుతూ... శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థాన అభివృద్ది మాస్టర్ ప్లాన్ తయారీ, ఇతర అభివృద్ది పనులను చేపట్టేందుకు దేవస్థానం భూముల సరిహద్దులు ఇప్పటి వరకూ సరిగా ఖరారు కాకపోవడం పెద్ద ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంయుక్త నేతృత్వంలో సంబందిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. ఈ సమావేశంలో శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల అంశంపై సమగ్రంగా సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు. 


అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్సు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో దేవస్థానం భూముల సర్వే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతున్నట్టు కొట్ట తెలిపారు. బ్రిటీష్ పరిపాలనా కాలం 1879 సంవత్సరం ప్రాంతంలో 7 స్క్వేర్ మైళ్ల భూమి అంటే దాదాపు 4,130 ఎకరాల భూమిని శ్రీశైల దేవస్థానానికి కేటాయించారు. 1967 ప్రాంతంలో మరో 145 ఎకరాల భూమి శ్రీశైల దేవస్థానానికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే నాగార్జున సాగర్ – శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఈ దేవస్థానం భూములు ఉండటంతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ భూముల సరిహద్దుల ఖరారు తప్పనిసరైంది. 


అక్టోబరు నెలాఖరులోపు  ఈ దేవస్థానం భూముల సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తియిన వెంటనే  దేవస్థానం అభివృద్దికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడంతోపాటు అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని కొట్టు తెలిపారు. రిజర్వ్ ఫారెస్టు నియమ నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, మతపరమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ది పరుస్తామని ఆయన తెలిపారు.  


ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు….


బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేందుకు సహకరిస్తున్న అందరికీ కొట్టు ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఎటు వంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేసినట్టు పేర్కొన్నారు. కేవలం అరగంట సమయంలోనే భక్తులు అమ్మవారిని ఎంతో చక్కగా దర్శించుకోగలుగుతున్నారన్నారు. సామాన్య భక్తులకు రెండు క్యూలైన్లతోపాటు రూ.500/-, రూ.300/- రూ.100/- ల టికెట్లు కొనుగోలుదారులకు వేరు వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వి.ఐ.పి.ల విషయంలో ప్రొటోకాల్ పటిష్టంగా అమలు పరుస్తున్నామని... వి.ఐ.పి.లు ఎంతో చక్కగా అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. ప్రతిరోజు దాదాపు 60 వేల వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది అక్టోబరు 2న ఒక లక్షా 50 వేల వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన తెలిపారు.