Indrakeeladri Dasara Utsavalu 2022  : బెజ‌వాడ దుర్గమ్మ ఆల‌యంలో ఈ ఏడాది దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ తెలిపారు. ప్రతి భక్తుడికీ దర్శనం కల్పించాలనేదే ఉద్దేశంతో ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నప్పటికీ ఏటా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విష‌యాన్ని ఆయ‌న ప్రస్తావించారు. ద‌స‌రా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో స‌మీక్షించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఘాట్ రోడ్డుపై అంబులెన్స్, ఫైర్ సర్వీసులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. మిగిలిన స్థలమంతా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. టోల్ గేట్ ఒక ఎంట్రన్స్ భక్తులకు, మరో ఎంట్రన్స్ అంబులెన్స్, ఫైర్ సర్వీస్ లకు ఉపయోగిస్తామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రముఖులు రోజుకు ఒక్క లెటర్ మాత్రమే అనుమతిస్తామన్నారు. సిఫార్సు లేఖలపై  6 గురికి వీఐపీ దర్శనం టికెట్స్ స్లాట్స్ కేటాయిస్తామన్నారు. ఒక్కొక్క టికెట్ ధర రూ.500 జారీ చేస్తామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రముఖులు స్వయంగా దర్శనానికి వస్తే వారితోపాటు 5 గురికి ఉచిత వీఐపీ దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. 5 టైమ్ స్లాట్ ల ప్రకారం దర్శనాలకు ఏర్పాట్లు చేశామ‌ని అన్నారు.


స్లాట్ టైమింగ్స్ 



  • తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటలు

  • ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు

  • ఉదయం 10 గంటల నుంచి 12 గంటలు

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు 

  • రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వ‌ర‌కు 


దర్శనం మిస్ అయితే


ఒకసారి స్లాట్ దర్శనం జరగకపోతే మరోసారి దర్శనం చేసుకోడానికి అవకాశం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మళ్లీ టికెట్ కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లాల్సిందేన‌ని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖపై 1+5 ఉచిత టికెట్ దర్శనం, ఒక ఎమ్మెల్యేకి రోజుకి ఒక లెటర్ మాత్రమేనన్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జ్ కు వెసులుబాటును బట్టి టికెట్లు కేటాయిస్తామన్నారు. వీఐపీ దర్శనాలకు వచ్చే వారి కోసం మోడల్ గెస్ట్ హౌస్ వద్ద వాహనాలు ఏర్పాటు చేయాల‌ని ప్రతిపాదించామన్నారు. ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ప్రసాదం కౌంటర్లన్నీ ఎగ్జిట్ వద్దే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసాదంలో నాణ్యత పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యతతో 100 గ్రాముల లడ్డూ తయారీ చేయాలని సూచించారు. భక్తులకు  పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం బఫే తరహాలో అందజేస్తామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. భవానీ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామ‌ని మంత్రి తెలిపారు.


వినాయ చవితి ఉత్సవాలపై అనవసర రాద్ధాంతం  


" వినాయకుడు ఎంతో శాంతమూర్తి, ఆయనతో ఆడుకుంటే అంతే కోపోదృక్తుడవుతాడు. బీజేపీ నాయకులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మేం దేవుడితో ఆడుకుంటాం ఏంచేస్తారని సవాల్ విసురుతున్నారు. బీజేపీ చేసే విమర్శలకు టీడీపీ నేతలు వంతపాడటం సిగ్గుచేటు. విేనాయక చవితి పందిళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. కేవలం ఫైర్, పోలీస్ పర్మిషన్లకు నామమాత్రం రుసుములే వసూలు చేస్తున్నాం. దయచేసి భగవంతుడితో ఆడుకోవద్దు. దేవుడితో రాజకీయం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తున్నాం. విజయవాడలో వీధివీధినా పందిళ్లు ఏర్పాటుచేశారు. మేం నిజంగానే వారిని ఇబ్బంది పెడితే ఎందుకు ప్రజలెవరూ ఫిర్యాదు చేయలేదు. ఇంతవరకూ ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? భగవంతుడి కార్యక్రమాన్ని స్నేహపూరిత వాతావరణంలో జరుపుకోవాలి. గతంలో 44 ఆలయాలు పడేస్తే బీజేపీ నేతలు కిక్కురుమనలేదు. " - మంత్రి కొట్టు సత్యనారాయణ 


Also Read : Vinayaka Mandapas Issue : ఏపీలో వినాయక మండపాల వివాదం, వ్యూహ‌త్మకంగా వైసీపీ కౌంట‌ర్ ఎటాక్!