Vinayaka Mandapas Issue :ఏపీ రాజకీయం వినాయక మండపాల చుట్టూ తిరుగుతోంది. ఈ వివాదంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహరంపై పక్కాగా వ్యవహరించింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, వారితో సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి పందిళ్లను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా రాజకీయంగా వ్యవహారాన్ని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ కౌంటర్ ఎటాక్
ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెత చందాన వైసీపీ వినాయక చవితి పందిళ్ల వ్యవహారంలో రాజకీయం సాగించింది. ప్రతిపక్షాలు అన్ని ఏకమై విమర్శలు, ఆరోపణలు, నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో వైసీపీ కూడా ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించింది. సున్నితమైన అంశాలు కావటంతో అదే కోవకు చెందని వర్గాలను పార్టీ తరపున రంగంలోకి దింపింది. ఒక్కో రోజు ఒక్కో నాయకుడితో వినాయక చవితి విగ్రహాల రాజకీయంపై కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేసింది. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించి ప్రతిపక్షాలకు కౌంటర్ గా ఎదురుదాడి చేసింది. ఆదివారం మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లితో వినాయక చవితి విగ్రహాల రాజకీయంపై కౌంటర్ ఎటాక్ చేయించింది. ఇక సోమవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు, టీటీడీ బోర్డ్ మాజీ మెంబర్ మల్లాది విష్ణుతో ఇదే అంశంపై ప్రతిపక్షాలపై దాడి చేయించింది.
బూటు కాళ్లతో పూజలు చేసిన బాబు
ఇవాళ పండుగకు ఒక రోజు ముందు డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతితో ఇదే అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ గా ఇప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడని రఘుపతి ఇప్పుడు వినాయక విగ్రహాల వివాదం సాక్షిగా రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వటం విశేషం. పనీపాట లేని పార్టీలే దేవుడ్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాయని, పండగ వేళ స్వార్థపర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీతిమాలిన, దిగజారిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. బూటు కాళ్లతో పూజలు చేసి హిందూ ధర్మాన్ని కించపరిచిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. విజయవాడలో బాబు కూల్చిన దేవాలయాలను జగన్ పునర్ నిర్మించారన్నారు. వినాయక చవితి వేడుకల్లో కొత్త ఆంక్షలేవీ లేవని, టీడీపీ హయాంలో వినాయకుని మండపాలకు కనీస విద్యుత్ ఛార్జీ రూ.1000 కాగా నేడు రూ. 500 మాత్రమేనని రఘుపతి వెల్లడించారు.
పోలీస్ మార్చ్
రాజకీయంగా పార్టీ తరపున నాయకులతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇప్పించటంతో పాటే, ఎవరైనా అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ బెజవాడ కేంద్రంగా పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. వరుసగా రెండు రోజుల పాటు బెజవాడ నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారనే ప్రచారం ఉన్నప్పటికీ పనిలో పనిగా వినాయక చవితి విగ్రహాలను కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు ఆందోళనలకు పిలుపు నివ్వటంపై ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యి, పోలీసులతో బెజవాడ వీధుల్లో కవాతు చేయించిందని ప్రచారం జరుగుతుంది.
Also Read : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ, ఏమైందంటే?
Also Read : Vinayaka Chaviti 2022 : గణేష్ మండపాల చుట్టూ ఏపీ రాజకీయాలు, ఇంతకీ అనుమతి తీసుకోవాలా? వద్దా?