విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 


ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి


ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 13 మృతదేహాలను వెలికితీయగా, వారిలో విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోని ఇద్దరు లోకో పైలట్లు, పలాస ప్యాసింజర్ గార్డు ఎంఎస్ రావు కూడా ఉన్నారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సహాయక చర్యల్లో ద.మ.రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే, ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను అక్కడి నుంచి క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. 


గుర్తించిన మృతుల వివరాలు


ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.



  • గిరిజాల లక్ష్మి (35), ఎస్.పి.రామచంద్రాపురం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా

  • కంచు భారతి రవి (30), జోడుకొమ్ము గ్రామం, జామి మం. విజయనగరం జిల్లా

  • చల్లా సతీశ్ (32), తండ్రి పేరు చిరంజీవ రావు (లేట్), ప్రదీప్ నగర్, విజయనగరం

  • ఎస్.హెచ్.ఎస్.రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, ఉత్తరప్రదేశ్

  • కరణం అక్కలనాయుడు (45), తండ్రి పేరు చిన్నయ్య, కాపుసంబాం గ్రామం, గరివిడి మం. విజయనగరం

  • ఎం.శ్రీనివాస్, విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు

  • చింతల కృష్ణమనాయుడు, దెందేరు గ్రామం, కొత్తవలస మం. విజయనగరం

  • రెడ్డి సీతమనాయుడు (43), రెడ్డిపేట గ్రామం, చీపురుపల్లి మం. విజయనగరం

  • మజ్జ రాము (30), గదబవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం.


'ఘటనా స్థలానికి రావొద్దు'


మరోవైపు, ప్రమాద స్థలానికి బయటి వారు రావొద్దని రైల్వే అధికారులు కోరుతున్నారు. కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారని దీని వల్ల టెక్నికల్ సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. 'అందరికీ విన్నపం. ఇది చాలా సున్నితమైన, విషాద సంఘటన అని మాకు తెలుసు. మా సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. దయచేసి రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతంలోకి ప్రవేశించవద్దు. అలా వస్తే పనులు, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని రైల్వే అధికారులు, సిబ్బందికి సహకరించగలరు.' అంటూ అధికారులు కోరారు. 


యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ


అటు, ప్రమాదం స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది నిర్వహిస్తున్నారు. బోగీలు నుజ్జు నుజ్జు కావడంతో విశాఖ నుంచి బాహుబలి క్రేన్ తెచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి సారించారు. పలాస ప్యాసింజర్ లోని 11 బోగీలు అలమండ స్టేషన్ కు, రాయగడ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్ కు తరలించారు. సహాయక చర్యలు సాగుతుండగా, ఘటనా స్థలి వద్ద 2 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. స్థానికులు అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.





 


Also Read: విజయనగరంలో రైలు ప్రమాదంతో ఈ ట్రైన్స్ రద్దు- మరికొన్ని దారి మళ్లింపు