Ys Vijayamma Comments : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్, అక్కడి ప్రభుత్వం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీ రాష్ట్రం, సీఎం జగన్‌తో మనకేంటి అంటూ ఆమె మీడియా ప్రతినిధుల్ని ఎదురు ప్రశ్నించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి వెళ్లేందుకు వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నుంచి ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నరు. ఈ సందర్భంగా.. తమ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు. ఓ రిపోర్టర్.. అరెస్ట్ అయిన షర్మిలకు సంఘిభావంగా ఏపీ సీఎం జగన్ కూడా హైదరాబాద్ వస్తారా అని ప్రశ్నించారు.
జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విజయమ్మ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ఆ రాష్ట్రం, జగన్‌తో మనకేంటి అని ఆమె ప్రశ్నించారు. ఒకటికి రెండు సార్లు అలా చెప్పడంతో జర్నలిస్టులు కూడా అయోమయానికి గురయ్యారు. సోదరిని అరెస్ట్ చేయడంతో పరామర్శించడానికి జగన్ కూడా హైదరాబాద్ వస్తారని వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అదంతా అవాస్తవమని... విజయమ్మ స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ విజయమ్మ స్పందన మరీ పుల్ల వరిచినట్లుగా ఉండటం.. అసలు సంబంధం ఏమిటన్నట్లుగా మాట్లాడటంతో అనేక రకాలచర్చలకు కారణం అవుతోంది.
వైఎస్ జగన్ కుటుంబంలో విభేధాలున్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ వైదొలిగారు. రాజీనామా చేశారు. ఈ కారణంగా ఆమె మాటలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. అదే సమయంలో తన బిడ్డను చూసే హక్కు కూడా లేదా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. తన బిడ్డను చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. షర్మిలను పరామర్శించేందుకు బయల్దేరిన విజయమ్మను లొటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడే నిరాహార దీక్షకు దిగిన విజయమ్మ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
షర్మిల ఇంటికొచ్చే వరకు దీక్ష చేస్తానని అన్నారు. అసలు షర్మిల చేసిన నేరమేంటని నిలదీశారు. పాదయాత్ర చేస్తే తప్పా? పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని అన్నారు. తాము ప్రభుత్వాలు నడిపామని..? తమకు పోలీసులు కొత్తేమీకాదన్నారు. నిరసన తెలిపితే షర్మిలను అరెస్ట్ చేస్తరా అని ప్రశ్నించారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని.. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చెయ్యలేరన్నారు.ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలతో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ లో నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు.
ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్ - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?