Gorantla Butchaiah Chowdary: తూర్పు గోదావరి జిల్లా... రాజమండ్రి: జిల్లాలో డిసెంబర్ 1వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. సీఎం జగన్ విధానాల వల్ల రాష్ర్టానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ప్రజలకు చెప్పేందుకు ‘‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’’ అనే కొత్త నిరసన కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీన కొవ్వూరుకు చంద్రబాబు రానున్నారు. రాజమండ్రి స్థానిక గాంధీపురం ప్రియాంక గార్డెన్స్‌లో ఎమ్మెల్యే గోరంట్ల అధ్యక్షతన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలు మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని గొంతు ఎత్తి ప్రశ్నిస్తే, వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లోకి తోస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో, ప్రజలలోను మార్పు మొదలైందని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని గోరంట్ల అన్నారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వానికి, ఈ సీఎంకి చరమగీతం పాడాలని, కొవ్వూరులో జరిగే చంద్రబాబు పర్యాటనకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ చంద్రన్నను అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు జవహార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోం శాఖ మంత్రి, పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు కెఎస్ జవహార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నవంబర్ 30వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయిలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న రామచంద్రరం గ్రామంలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం చింతలపూడిలో రోడ్ షో నిర్వహించి రాత్రి అక్కడే బస చేస్తారు. అక్కడ నుంచి డిసెంబరు 1న తాడువాయి మీదుగా రోడ్ షోలో పాల్గొని.. పోలవరం చేరుకుంటారు చంద్రబాబు. పోలవరం నుంచి రాత్రికి కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు రాత్రికి అక్కడే బస చేస్తారు. డిసెంబర్ 2వ తేదీన కొవ్వూరు నుంచి రోడ్ షో ద్వారా నిడదవోలు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా తాడేపల్లిగూడెం చేరుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు.