Andhra Pradesh Temple Fire: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు చలువ పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.  






శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి  


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని మపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు పురస్కరించుకుని గత నెలలో ఆలయంలో తాటాకు పందిరి వేశారు. శ్రీరామనవమి సందర్భంగా  స్వామివారి ఎదురు సన్నాహం చేపట్టిన సందర్భంలో తారాజువ్వలు వేశారని అవి పందిరిపై పడటం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడటంతో ఆలయ ప్రాంగణం పొగతో కప్పేసింది. స్థానికులు సకాలంలో చేరుకొని చాలా వరకు మంటలు అదుపు చేశారు. శ్రీరామనవమి రోజు ఇటువంటి ఆపశృతి పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  


ఇండోర్ లో విషాదం 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి రోజున పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. మెట్టుబావిలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. కొంత మందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.


పటేల్‌ నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆలయంలో స్థలం తక్కువ కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే ప్రమాదవశాత్తు మెట్లబావి పైకప్పు కూలిపోయింది. దీంతో 25 మంది భక్తులు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదం సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 10మందిని కాపాడి వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగుల పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.  ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.