Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి వాహనం నది జాలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు మాక్స్ సోన్ ప్రయాగ నుంచి ప్రయాణికులు కారులో బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాలకుంటి బ్రిడ్జి నుంచి గులార్ వైపు వెళ్తుండగా..భారీ వర్షం కారణంగా కొండపై నుంచి రాయి విరిగి పడడంతో కారు అదుపు తప్పి నేరుగా నదిలోకి దూసికుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గల్లంతైన వారిలో విజయనగర వాసి..
గల్లంతైన వారిలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారని అధికారులు తెలిపారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో భార్యను విపత్తు నిర్వహణ బృందం రక్షించగా..రవిరావు ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారందరూ చనిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారు 9 గంటల పాటు కనిపించకుండా పోయారని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్యాట ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లిన వారంతా అక్కడే చిక్కుకుపోతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర నిలిచిపోయింది. బల్తాల్, పహల్గాం మార్గాల్లో వరుసగా రెండోసారి శనివారం అమర్‌నాథ్ యాత్ర నిలిచిపోయింది. శ్రీనగర్-జమ్మూతీయ రహదారి మూసివేయబడింది మరియు యాత్రికుల ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో రోడ్లు కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్ నాథ్ యాత్రను జూలై 1న ప్రారంభించారు. అప్పటి నుంచి దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర గుహ మందిరంలో 80,000 మందికి పైగా యాత్రికులు ప్రార్థనలు చేశారని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో 40 ఏళ్ల రికార్డు బ్రేక్..
ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 153 మి.మీ వర్షపాతం నమోదైంది. 40 ఏళ్ల రికార్డు బద్దలైంది. 1982లో జూలైలో ఈ స్థాయిలో వర్షాపాతం నమోదైంది. దశాబ్దకాలం రికార్డును బ్రేక్ చేస్తూ తాజాగా వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా కురుస్తోంది. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. 204.4 మి.మీ మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అతి తీవ్ర భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, అలాగే వరద ముప్పుపై వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లద్దని అధికారులు చెబుతున్నారు.