Police Arrested Teachers and UTF leaders : సీపీఎస్‌ రద్దుపై యూటీఎఫ్ నాయకులు ఛలో సీఎంవోకు పిలుపునివ్వడంతో ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎంవోకు తరలివస్తున్న ఉపాధ్యాయులను ఎక్కడకిక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. యుటిఎఫ్ నాయకులు సీఎంవో ముట్టడి (UTF Chalo AP CMO: )కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసుల తీరు పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉద్యోగుల ఛ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఆ త‌రువాత ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని స్దితిలో ఉద్యోగుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి వచ్చింది.


పోలీసుల అత్యుత్సాహం.. 
గుంటూరు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. తెనాలి వేమూరు నియోజకవర్గాల్లో ఉదయాన్నే స్కూలుకు వెళుతున్న ఉపాధ్యాయులను సైతం అడ్డగించి పోలీసులు అరెస్టు చేశారు. యూటీఎఫ్ ఉపాధ్యాయులు ఛలో సీఎంవో నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీ లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లు, బస్ స్టేషన్ లలోకి వెళ్లే వారిని ఐడీ కార్డులు చెక్ చేసి మాత్రమే పంపుతున్నారు. 


మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అన్ని రహాదారులలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, ప్రతి ఒక్కరిని ఐడీ కార్డులు చూసి పంపుతున్నారు. కాజా టోల్ ప్లాజా వద్ద ఇప్పటివరకు 26 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులను కూడా పోలీసులు అడ్డుకోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రకాశం బ్యారేజ్‌, కనకదుర్గ వారధిపై భారీగా పోలీసులను భారీగా మోహరించారు. తాడేపల్లి వైపు వెళ్లే అన్నిరకాల వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. సెల్ ఫోన్లు సైతం తీసుకుని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండటంపై ప్రయాణికులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గంలో విజయవాడ బయలుదేరిన 100 మంది యూటీఎఫ్‌ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


విజయవాడలో తనిఖీలు
ఛలో సీఎంవోకు వెళ్లకూడదని స్టేషన్‌కు పిలిపించి సంతకాల సేకరించారని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. శనివారం రాత్రి నుంచే ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు సభకు వెళ్లకూడదంటూ ఎక్కడికక్కడ యూటీఎఫ్‌ నేతలు, ఉపాధ్యాయులను గృహనిర్బంధం చేస్తున్నారు. విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, అనుమానంగా కనిపించిన వారిని సైతం పీఎస్‌లకు తరలిస్తున్నారు.


విజయవాడ మార్గాల్లో చెక్‌పోస్టులు
ఛలో ఏపీ సీఎంవోను భగ్నం చేసేందుకు పోలీసులు కంచెలతో సీఎంవో వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 650 మంది పోలీసులతో భారీ బందోబస్తుగా ఉన్నారు. యూటీఎఫ్ సీఎంవో ముట్టడి పిలుపు నేపథ్యంలో విజయవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి, ఐడీ కార్డులు చెక్ చేసి పంపిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతో పటిష్ట నిఘాతో ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నేతలు సీఎంవో వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. 


Also Read: AP Govt Teachers Holidays : ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు


Also Read: UTF Chalo CMO : నేడు యూటీఎఫ్ ఛలో సీఎంవో, అనుమతిలేదంటున్న పోలీసులు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు