IPL 2022 MI vs LSG Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కేఎల్ రాహుల్ వీర విహారం చేస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై అజేయ శతకం సాధించడంతో కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరసన నిలిచాడు రాహుల్. 


తనకు ప్రియమైన శత్రువు టీమ్ ముంబై ఇండియన్స్‌పై వాంఖేడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (103 నాటౌట్: 62 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అజేయ శతకం బాదేశాడు. ఇది కేఎల్ రాహుల్ టీ20 కెరీర్‌లో 6వ సెంచరీ. కాగా, రోహిత్ శర్మ సైతం టీ20 ఫార్మాట్లో ఆరు సెంచరీలు చేయడంతో.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత క్రికెటర్ గా రోహిత్ సరసన నిలిచాడు రాహుల్. 


కేఎల్ రాహుల్ అజేయ శతకం సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను లక్నో బౌలర్లు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులకు కట్టడి చేశారు. దీంతో 36 పరుగుల తేడాతో ముంబైలో లక్నో మరో ఘన విజయాన్ని నమోదుచేయగా.. ఐపీఎల్ 2022లో వరుసగా 8వ ఓటమిని చవిచూసింది రోహిత్ సేన. ఐపీఎల్ 15 సీజన్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇంకా ఖాతా తెరవలేదు.


కాగా, ఏప్రిల్ 16న జరిగిన మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ ముంబై బౌలర్లపై శివతాండవం చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ రాహుల్ (103) సెంచరీ సాధించగా.. 18 పరుగుల తేడాతో ముంబైపై లక్నో విజయం సాధించింది. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ మరో హీరోచిత శతకంతో లక్నో జట్టును నడిపించాడు కెప్టెన్ రాహుల్. 







భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీ వీరులు..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ - 6
విరాట్ కోహ్లీ  - 5
సురేష్ రైనా  - 4


ముంబై అంటే రాహుల్‌కు పూనకాలే..
ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ 15 మ్యాచులు ఆడాడు. 76.40 సగటు, 132 స్ట్రైక్‌రేట్‌తో 764 పరుగులు చేశాడు. ఐదుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఐదు అర్ధశతకాలు చేశాడు. రెండు సెంచరీలు ఉతికారేశాడు. అతడికి మరే జట్టుపైనా ఇన్ని పరుగులు లేవు. ఇంత సగటు, స్ట్రైక్‌రేట్‌ లేవు. బాల్ బ్యాట్ మీదకు రావడం, రాహుల్‌కు కలిసొచ్చే పిచ్ కావడంతో ముంబై సొంత మైదానం వాంఖడేలో రాహుల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రతి జట్టు ప్రతి సీజన్‌లోనూ ఓ మ్యాచ్ సొంత వేదికలో ఆడుతుందని తెలిసిందే.


Also Read: IPL 2022, KL Rahul: ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ లవ్‌ అఫైర్‌!! ఏంటీ కహానీ!! 


Also Read: LSG Vs MI: ఓటమి నంబర్ 8 - కొనసాగుతున్న ముంబై పరాజయాల పరంపర - ఎంఐపై రాహుల్ రెండో సెంచరీ!