AP Govt Teachers Holidays : ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మే 20 వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే సెలవులు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.  జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయి. 


పాఠశాలలకు వేసవి సెలవులు


ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది. మే 4వ తేదీ నాటికి అన్ని తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. జులై 4వ తేదీన పాఠశాలలను తిరిగి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. 


విద్యాశాఖ కీలక ఆదేశాలు 


ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎండలతో సాధారణ ప్రజలతో పాటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నా మధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి పిల్లలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ లోపు 1 - 10వ తరగతులకు పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 4వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 


కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో మార్పు 





కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యాసంవత్సరం అంతంత మాత్రంగా నడిచింది. కరోనా తర్వాత విద్యాసంవత్సరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.  సిలబస్ తగ్గింపు, సెలవుల కుదింపుతో పాటు విద్యా సంవత్సరాన్ని ముందుకు జరిపింది. రెండేళ్లు అయితే పదోతరగతి పరీక్షలు రద్దు చేసింది. అయితే ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉండగా మే 6 వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు వెళ్లాయి.