Bandi Sanjay Praja Sangrama Yatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 11 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో బండి సంజయ్ కు వడదెబ్బ తగిలిందని డాక్టర్ శరత్ తెలిపారు. పైగా ఎసిడిటీ సమస్య కూడా ఉందని వైద్యులు తెలిపారు. పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. కానీ పాదయాత్ర కొనసాగించేందుకే బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. డీహైడ్రేషన్, ఎసిడిటీ వల్ల ఆయన కొంత బలహీనంగా ఉన్నారని డాక్టర్ శరత్ తెలిపారు. బండి సంజయ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వం
అనంతకు ముందు పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రానికి సీఎం ఏ విధంగా అయితే బాస్ గా ఉంటారో గ్రామానికి సర్పంచ్ సర్వాధికారిగా ఉంటారన్నారు. గ్రామాల్లో ఏయే అభివృద్ధి పనులు కావాలనే విషయంపై గ్రామ ప్రజలే గ్రామసభ నిర్వహించుకుని నిర్ణయం తీసుకునే అధికారం కల్పిస్తామన్నారు. అంతిమంగా సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు గల్లా ఎగరేసుకునేలా వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తామని బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సహా స్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నర్వ గ్రామ సర్పంచ్ సంధ్య అధ్యక్షత వహించారు.
సర్పంచులకు వేధింపులు
సర్పంచులు మాట్లాడుతూ ఉత్సవ విగ్రహాల్లా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. హరిత హారం చెట్లు ఎండి పోయాయని తమకు నోటీసులిస్తూ వేధిస్తున్నారని వాపోయారు. తమ గ్రామాల్లో అభివృద్ధి లేదని, రోడ్లు, మౌలిక సదుపాయాలే లేవని అన్నారు. ముఖ్యంగా బీజేపీ సర్పంచులున్న చోట వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ప్రస్తుతం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రం ఇచ్చేవన్నారు. పల్లె ప్రగతి నిధులు సైతం కేంద్రానివేనని కానీ సీఎం ఫోటోలు పెట్టుకుంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న బండి సంజయ్ వారిక భరోసా కల్పిస్తూ మాట్లాడారు.
ఐదేళ్లకు కోటి రూపాయిలు
నర్వ సర్పంచ్ బీజేపీ నాయకురాలు కావడం ఆమె అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక ఝార్ఘండ్ వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులకు అత్యంత గౌరవమిస్తే కేసీఆర్ మాత్రం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ అవమానిస్తున్నారన్నారు. గంగదేవిపల్లెలో సర్పంచులతో సీఎం సమావేశం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహింపజేసి ఆరోజు నుంచే సర్పంచులను కేసీఆర్ అవమానించడం మొదలు పెట్టారన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి సగటును ఐదేళ్ల కాలానికి కోటి రూపాయలిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. దేశంలో 2 లక్షల 35 వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే ఐదేళ్ల కాలానికి 2 లక్షల 68 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయిస్తోందన్నారు.