UTF Chalo CMO: సీపీఎస్‌ రద్దుపై యూటీఎఫ్ నాయకులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారం ఛలో సీఎంవో కార్యక్రమం చేపట్టినట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ఛలో సీఎంవో నిర్వహించి తీరుతామన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ‘ఛలో సీఎంవో’ కార్యక్రమం చేపట్టడంతో యూటీఎఫ్ నాయకులను పోలీసుల ఎక్కడికక్కడే గృహ నిర్బంధాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ జిల్లా వ్యాప్తంగా మొత్తం 200 మంది నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి బైక్‌ ర్యాలీలుగా యూటీఎఫ్‌ నాయకులు విజయవాడకు చేరుకుంటున్నారు. రేపు బైక్‌లపై సీఎంవోను ముట్టడిస్తామని యూటీఎఫ్‌ నాయకులు అంటున్నారు. 


ఛలో సీఎంవోకు అనుమతి లేదు : పోలీసులు 


అయితే యూటీఎఫ్ ఛలో సీఎంవోకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా వెల్లడించారు. రేపు ఛలో సీఎంవో కార్యక్రమంలో యూటీఎఫ్ ఉద్యోగులెవరూ పాల్గొవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో పోలీస్‌ యాక్ట్‌ 30 విధించామని సీపీ తెలిపారు. 144 సెక్షన్‌ కూడా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, సీఎం జగన్‌ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్‌ నాయకులు రేపు ఛలో సీఎంవో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా ఛలో సీఎంవో కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


అంగన్వాడీ వర్కర్లను అర్ధరాత్రి నడిరోడ్డుపై కూర్చోబెట్టిన పోలీసులు


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దిగువ చావలి జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి అంగన్వాడీ కార్మికులను పోలీసులు నడిరోడ్డు మీద కూర్చోబెట్టారు. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి విజయవాడలో  ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో జరగబోవు ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆవిర్భావ మహాసభకు హాజరయ్యేందుకు మూడు బస్సులలో సుమారు 150 మంది అంగన్వాడీ కార్యకర్తలు బయలుదేరారు. మార్గమధ్యంలో పెళ్లకూరు మండలం దిగు చావాలి వద్ద భారీగా పోలీసులు మోహరించి బస్సులను అడ్డుకొని మహిళలను అర్ధరాత్రి నడిరోడ్డు మీద కూర్చోబెట్టారు. దీంతో మహిళలు భోజనం నీరు దొరక్క నానా అవస్థలు పడ్డారు. ఆదివారం ఉదయం వరకు కూడా అంగన్వాడీ కార్మికులు రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలియజేశారు. పోలీసులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారిని తిరిగి ఇంటికి వెళ్లాలని పదే పదే ఆదేశిస్తున్నారు. మమ్మల్ని విజయవాడ సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు కాబట్టి అక్కడ సభ పూర్తయ్యే సమయం వరకు రోడ్డు మీద కూర్చొని ఉంటామని పోలీసులకు తెలిపారు. 


సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు రక్షణ కల్పించాల్సి ఉండగా అర్ధరాత్రి ఇలా నడి రోడ్డుపై కూర్చోబెట్టడం ఏమిటంటూ అంగన్వాడీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి తిరిగి ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు ఇలా నడిరోడ్డుపై కూర్చోబెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మహిళలకు రక్షణ అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు. తమ ఉద్యోగ విధి నిర్వహణలో ఇలాంటి ప్రభుత్వానికి ఎప్పుడూ చూడలేదని అన్నారు. శాంతియుతంగా వెళుతున్న మమ్మల్ని  ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు.