Union Minister Ram Mohan Naidu says planning for 7 more airports in Andhra Pradesh | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 7 ఎయిర్ పోర్టులు ఉండగా, వాటిని 14కు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామన్నారు.  శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక భేటీల్లో పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రితో సమావేశమయ్యారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులను విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. శనివారం నాడు సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్షలో పాల్గొన్నారు.


అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్‌పోర్టులను 14కు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, రాజమహేంద్రవరం, కడప ఎయిర్ పోర్టుల్లో టెర్మినల్‌ సామర్థ్యం పెంపు పనులపై సైతం చంద్రబాబుతో సమీక్షించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం భూమని గుర్తించి, కేటాయిస్తే రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు కోసం గుర్తించినట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, విమానయానశాఖ కలిసి పనిచేస్తాయన్నారు.


భూమి కేటాయించాలని చంద్రబాబుతో చర్చలు


ఏపీలోని ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాలకు భూమిని గుర్తించి కేటాయిస్తే కొత్త ఎయిర్‌పోర్టుల పనులపై శాఖ నుంచి సహాయం అందిస్తామన్నారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా చేయాలనేది ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. అయితే రాష్ట్రాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా చేయడానికి విమానాశ్రయాల పాత్ర కీలకమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీలో సీ ప్లేన్ పాలసీపై సైతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.


ఢిల్లీలో పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు నేడు మరికొందరు కేంద్రం పెద్దలతో సమావేశం అవుతారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ దొరికినట్టు సమాచారం. కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయింపులపై ధన్యవాదాలు తెలపుతారు. పోలవరం నిధులతో పాటు రాజధాని అమరావతికి నిధులు విడుదల సహా రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. 


Also Read: Alla Nani: వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ