ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రెసిడెంట్ మెడల్స్ జాబితా ఈ ఏడాది కూడా విడుదల అయింది. దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అనే పతకం, ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఇంటిలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, 12వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ రాష్ట్రపతి మెడల్‌కు (ప్రెసిడెంట్ మెడల్) ఎంపికయ్యారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఎంపికైన వారి జాబితాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ అవార్డులు వచ్చాయి. ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు 15 దక్కాయి. మొత్తం దేశవ్యాప్తంగా 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 93 మందికి గానూ రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM) కు ఎంపకైనట్లు ప్రకటించారు. ఇంకో 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (PM) పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
ఏపీ శకటం ఎంపిక
జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ పథ్‌లో సైనిక విన్యాసాలు, శకటాలు, ఆయుధ సంపత్తి ప్రదర్శన నిర్వహించే సంగతి తెలిసిందే. అక్కడ శకటాల ప్రదర్శనలో భాగంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి 17 శకటాలను ఎంపిక చేశారు. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం గణతంత్ర దినోత్సవం రోజున రాజ్ పథ్‌పై ప్రదర్శితం కానుంది.