Union Budget 2023 : కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తాజా సమాచారంతో ఏపీ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు
- తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు- రూ.37 కోట్లు
- ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి- రూ.47 కోట్లు
- ఏపీ పెట్రోలియం యూనివర్సిటీకి - రూ.168 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు - రూ.683 కోట్లు
- మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు -రూ.6,835 కోట్లు
- సాలార్జంగ్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు
- తెలుగు రాష్ట్రాలతో సహా భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు
బడ్జెట్ సంతృప్తికరం - ఏపీ ఆర్థిక మంత్రి
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను శ్లాబ్ సామాన్యుడికి ఆశాజనకంగా ఉందని చెప్పారు. ఏడు ముఖ్యమైన అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చినట్టుగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కొవిడ్ తో దేశమంతా అల్లాడిందని కేంద్రం శ్రమపడుతుందంటే రాష్ట్రాలు కూడా పడుతున్నట్టేనని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఉపయోగపడే బడ్జెట్ అని కితాబుచ్చారు.
రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయ్
గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా, ఇప్పుడది 5.9 శాతానికి తగ్గిందని.. ఇది శుభపరిణామం అన్నారు. రైల్వేలు, రోడ్లలో మౌలిక వసతులపై బడ్జెట్ లో అధిక భారీగా నిధులు కేటాయించారన్న ఆయన..వ్యవసాయం, పౌరసరఫరాలపై కేటాయింపులు తగ్గినట్టుగా కనిపిస్తుందన్నారు. యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన వెల్లడించారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారని చెప్పారు. రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని, గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రైల్వే స్టేషన్ల వసతులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోందని చెప్పారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ఓ థీమ్ ప్రకారం రూపొందిస్తున్నారని, ఈసారి 7 ప్రధాన అంశాలను ప్రతిపాదికగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని వివరించారు.
తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులు
బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించారు. సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ - 300 కోట్లు, భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు కేటాయించారు. మొత్తం రెండు కర్మాగారాలకు నిధులు కేటాయించగా ఒకటి ఖమ్మం జిల్లా మణుగూరులో ఉంది. కేటాయిచిన నిధుల్లో సగం ఈ కర్మాగానికి లభించవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు చేశారు. రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు కేటాయించారు. వీటిలో సగం తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి లభించవచ్చు. దేశ దేశంలో ఉన్న అన్ని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు కేటాయించారు. ఈ 22 ఎయిమ్స్ ఆస్పత్రిల్లో ఒకటి తెలంగాణ, మరొకటి ఏపీలో ఉంది. వీటికి కొంత నిధులు లభించే అవకాశం ఉంది. సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు కేటాయించారు.