హనుమంతుడి జన్మ స్థలం వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే తిరుమలలోని అంజనాద్రి హనుమంతుడు పుట్టిన స్థలం అని చెప్పే ఆధారాలను టీటీడీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హింపీ పీఠం నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్న వేళ.. తాజాగా అదే అంశంపై టీటీడీ మరో ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిస్సందేహంగా అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలమని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ శ‌నివారం సాయంత్రం ముగిసింది. 


ఎలాంటి ఆలోచనలు అక్కర్లేదు: ధర్మారెడ్డి


ఈ వెబినార్‌లో దేశంలోని నలుమూలలతో పాటు అమెరికా నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, పురాణ, ఇతిహాస, భౌగోళిక పరిశోధనల్లో నిపుణులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వెబినార్ అనంతరం శనివారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. పురాణాలు, శాసనాలు.. భౌగోళిక ఆధారాలకు అనుగుణంగా ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల అని చెబుతున్నాయని ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఇక ఇందులో ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. పలువురు పీఠాధిపతులు, పండితులు, చారిత్రక పరిశోధకులు కూడా ఇదే విషయం గురించి తేల్చి చెప్పారని గుర్తుచేశారు.


అనంతరం జాతీయ సంస్కృత జాతీయ ఆచార్యులు చ‌క్రవ‌ర్తి రంగ‌నాథ‌న్ మాట్లాడుతూ.. తిరుమ‌ల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మ స్థలమని, ఆళ్వారుల పాశురాలలోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని తెలిపారు. వైష్ణవ సాహిత్యంలో తిరుమ‌ల‌-అంజ‌నాద్రి అనే అంశంపై మాట్లాడుతూ భ‌గ‌వంతుడి అనుగ్రహంతో జ‌న్మించిన ఆళ్వారులు భ‌క్తి ప్రప‌త్తుల‌ను న‌లుదిశలా వ్యాపింప చేశార‌ని చెప్పారు. వారు ర‌చించిన 4 వేల పాశురాల‌లో 207 పాశురాలు తిరుమ‌ల క్షేత్ర వైభ‌వాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజ‌నేయ‌స్వామివారి గురించి తెలుపుతున్నాయని తెలిపారు.


ప‌ద్మ, స్కంద‌ పురాణంలోనూ ఈ విషయం..


ఇక వెబినార్‌లో ‘‘పురాణ భూగోళంలో హ‌నుమంతుడు - అంజ‌నాద్రి’ అనే అంశంపై జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ రాణి స‌దాశివ‌మూర్తి మాట్లాడుతూ.. అంజ‌నాద్రి దాస క్షేత్రమ‌ని, వేంక‌టాచ‌ల మ‌హాత్యం అనేది వివిధ‌ పురాణాల సంకలనమని చెప్పారు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలుస్తున్నారని చెప్పారు. ప‌ద్మ, స్కంద‌, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందని ఆమె వివరించారు.


పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ‘భ‌క్తి కీర్తన‌ల‌లో అంజ‌నాద్రి’ అనే అంశంపై ప్రసంగించారు. భ‌గ‌వ‌త్ సాక్షాత్కారం క‌లిగిన తాళ్లపాక అన్నమ‌య్య, పురంద‌ర దాసులు, వెంగ‌మాంబ వంటి ప్రముఖ వాగ్గేయ‌కారులు అంజ‌నాద్రి ప‌ర్వతం గురించి త‌మ కీర్తన‌ల‌లో ప్రస్తావించార‌ని గుర్తు చేశారు. శ్రీరంగంలోని రంగ‌నాథ స్వామి ఆల‌యంలో ఉన్న శాస‌నం ద్వారా శేషాచల‌మే ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ స్థల‌మ‌ని తెలుస్తోందని అన్నారు.