తిరుమలలో గరుడ పంచమి నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు గరుడ పంచమి పర్వదినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో గరుడ పంచమి వేడుకలను ప్రతి సంవత్సరం టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో శ్రీవారు తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.  


కొవిడ్ నియమాలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు పాల్గొనేందుకు తితిదే అన్ని చర్యలు చేపట్టంది. ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవ కూడా ఈ నెలలో జరుగనుంది. ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ నిర్వహించనున్నారు.  రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగనున్నారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలంగా, మంచి వ్యక్తిత్వం గలవారిలా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన వాహనం గరుడ వాహనం. అందుకే గరుడుడిని ప్రధాన భక్తుడు అంటారు. శ్రీవారి గరుడ వాహన సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో మిగతా రోజులలో ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజు మాత్రం ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామికి అలంకరిస్తారు. 


తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 21,446 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. నిన్న స్వామివారికి 10,348 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 


శ్రీవారి సేవలో పీవీ సింధు


తిరుమల శ్రీ వారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో సింధు పాల్గొన్నారు. టోక్యో ఒలంపిక్స్​లో పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం తనకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపింది. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తానని చెప్పంది. త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తానని, యువతను ప్రోత్సహించేందుకే తాను అకాడమీ ప్రారంభిస్తున్నట్లు పీవీ సింధు తిరుమలలో అన్నారు. 


 


Also Read: TTD Update: హనుమంతుడి జన్మ స్థలంపై టీటీడీ మరో ప్రకటన.. ఆ విషయంలో ఇంకో ఆలోచనే లేదని వెల్లడి