TTD Installed Trap Cameras in Tirumala Footpath Route: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) వెంకటేశ్వరుడి క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దాదాపు 50 నుంచి 60 శాతం భక్తులు కాలిబాట మార్గంలోనే గోవింద నామస్మరణ చేసుకుంటూ వెంకటేశుని దర్శనం చేసుకుంటారు. అయితే, ఇటీవల కాలినడక మార్గంలో వన్యమృగాల సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది. నడకమార్గాల్లో తినుబండారాలు సాధు జంతువులకు అందించడం, వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వదిలెయ్యడం వల్ల మిగిలిన జంతువుల కోసం వన్యమృగాలు కాలిబాట మార్గం వద్దకు చేరుకోవడం అధికమైంది. ఈ క్రమంలో టీటీడీ (TTD) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలిబాట మార్గంలో వెళ్తున్న బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది మరువక ముందే నెల రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో బాలిక లక్షితపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచి అటవీ ప్రాంతంలో చంపేసింది. ఈ నేపథ్యంలో అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులకు కర్రలు అందించడం, రాత్రి పూట నడక మార్గాన్ని మూసేయడం, గ్రూపులుగా భద్రతా సిబ్బందితో కలిసి పంపించడం వంటి చర్యలు చేపట్టింది. అలాగే, వన్యమృగాల సంచారాన్ని పసిగట్టేలా నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. అనంతరం 6 చిరుతలను బంధించింది. తాజాగా, అదే నడక మార్గంలో ఇటీవల ఓ చిరుత, ఎలుగు సంచరించడం కలకలం రేపింది. ఈ క్రమంలో అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.


జీఎస్ఎం సాంకేతికతతో


అలిపిరి మెట్ల మార్గం పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న కారణంగా కాలిబాట మార్గానికి దగ్గరగా వన్యమృగాలు సంచరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శేషాచల అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వన్యమృగాల కదలికలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు టీటీడీ, అటవీ శాఖ సిద్ధమైంది. జీఎస్ఎం టెక్నాలజీ (GSM Technology) వినియోగించుకొని, యానిమల్ లైవ్ మూవ్మెంట్ ను ఈ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తారు. జంతువు జాడ తెలియగానే, లాటిట్యూడ్ తో సహా యానిమల్ ఫోటోను అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ డివైస్ కు చేరవేస్తుంది. తద్వారా వన్యమృగాల కదలికలు వెనువెంటనే కనుగొనేలా ఉపయోగ పడటమే కాకుండా, ఆ ప్రాంతంలో సిబ్బందిని సైతం అలెర్ట్ చేసి వన్య ప్రాణుల దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయవచ్చు. దీంతో పాటు వీడియో క్యాప్చర్ ట్రాప్ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చి వన్యమృగాల పూర్తి కదలికలు తెలుసుకునే అవకాశం ఉంది.


ఇలా పని చేస్తుంది


అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో సీసీ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేయనుంది. వీటికి అనలిటిక్స్ సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసి క్షణాల వ్యవధిలోనే ప్రమాద ఛాయలను అధికారులకు చేరవేస్తుంది. ఇందుకు అనలిటిక్స్ డ్యాష్ బోర్డ్ సమాచార వ్యవస్థగా పని చేస్తుంది.. అనలిటిక్స్ డ్యాష్ బోర్డ్ 10 అంశాలపై సమాచారం అందిస్తూ వస్తుంది. ముఖ్యంగా జోన్-ఇంస్ట్రక్షన్స్, యానిమల్ రికగ్నేషన్, వాహనాల రాకపోకల సంఖ్య, రాంగ్ వే, నో పార్కింగ్ జోన్, క్రౌడ్ కంజెక్షన్, ఫైర్, స్మోక్ డిటెక్షన్, ట్రిప్ వైర్స్, పీపుల్ కౌంట్, ఫేస్ రికగ్నేషన్, లెఫ్ట్ ఓవర్ ఆబ్జెక్ట్ లు ప్రథమంగా ఉన్నాయి. ఈ ఆధునిక సాంకేతికత వినియోగంతో నడక మార్గంలో భక్తులపై వన్యమృగాల దాడులను తప్పించవచ్చని  టీటీడీ భావిస్తోంది. వన్యమృగాలు, వన్య ప్రాణులు సీసీ కెమెరాలున్న ప్రాంతంలోకి రాగానే వాటి జాడలు గుర్తించి, అనలిటిక్స్ డ్యాష్ బోర్డుకు సందేశాన్ని క్షణాల వ్యవధిలో సమాచారాన్ని చేరవేస్తాయి. ఇది వన్యప్రాణుల నుంచి భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తుందని తిరుపతి వైల్డ్ లైప్ డీఏఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు.


Also Read: MP Kesineni Nani: 'నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు' - ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు