TTD News: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  శ్రీ కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి  ఆహ్వానించారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రిని చైర్మన్ కరుణాకరరెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందించారు. కాగా ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.


ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.


ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రక్తంగా నిర్వహించినట్లు చైర్మన్ వివరించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. 


శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టీటీడీ  ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు సుబ్బరాజు, తిప్పేస్వామి, సీవీఎస్వో నరసింహ కిషోర్‌, డీఎల్ఓ వీర్రాజు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.


శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు - 2023 వాహ‌న‌సేవ‌లు
శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 17న అంకురార్పణ జ‌రుగ‌నుంది. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి.


తేదీలు, ఉత్సవాలు 
17 రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ .
18న బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహ‌ణం, పెద్దశేష వాహ‌నం
19 ఉదయం చిన్నశేష వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం సాయంత్రం హంస వాహ‌నం
20 ఉదయం సింహ వాహ‌నం సాయంత్రం ముత్యపుపందిరి వాహ‌నం
21 ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నం, సాయంత్రం సర్వభూపాల‌ వాహ‌నం 
22 ఉదయం మోహినీ అవ‌తారం, సాయంత్రం గరుడ‌సేవ‌
23 ఉదయం హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం గ‌జ వాహ‌నం
24 సూర్యప్రభ వాహ‌నం, సాయంత్రం చంద్రప్రభవాహనం
25 ర‌థోత్సవం, సాయంత్రం అశ్వ వాహ‌నం 
26న ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం సాయంత్రం ధ్వజావ‌రోహ‌ణం