* ఇవాళ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ సమీక్షా సమావేశం ఉండనుంది.
* నేడు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు. మరోవైపు, తాడేపల్లిగూడెంలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొంటారు. సాయంత్రం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు అవుతారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని దొడగట్ట బీసీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొంటారు. సత్య సాయి జిల్లా చిలమత్తూరు పరిధిలోని కోడూరు నుంచి విజయవాడ వరకూ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించనున్నారు. విజయవాడ ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఎగుమతి ప్రాసెసర్లు, డాక్యుమెంటేషన్ పై నేడు అవగాహన సదస్సు జరగనుంది.
నేటికి సుప్రీంలో విచారణ వాయిదా
ఏపీలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం, ప్రత్యేక దర్యాప్తు టీమ్ చర్యలను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు రెండు గంటల పాటు వాదనలు సాగాయి. సుదీర్ఘ వాదనలు సాగిన అనంతరం సుప్రీంకోర్టు దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది.