ఏపీకి సినీ పరిశ్రమ తరలింపుపై ఆ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఇక్కడకు రావడంపై అనేక ఇబ్బందులున్నాయని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో, రెండు వేర్వేరు భాషలు (తమిళం, తెలుగు) కావున తేలికగా వచ్చిందన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉన్న సినీ పరిశ్రమను అక్కడి నుంచి మార్చలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


సీఎం జగన్ హామీలు


సినీ పరిశ్రమకు ఎలాంటి ప్రోత్సాహకాలైనా ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని పోసాని కృష్ణమురళి చెప్పారు. విశాఖలో స్డూడియోల నిర్మాణానికి ఎంత భూమి కావాలన్నా ఇస్తానన్నారని, మెగాస్టార్ కూడా సాగర తీరంలో స్టూడియోలు నిర్మించాలని భావించినట్లు పోసాని గుర్తు చేశారు. అంతే కాకుండా సినీ పరిశ్రమకు కావ‌ల‌సిన బ్యాంకు లోన్లు, రీ రికార్డింగ్ థియేట‌ర్ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్రోత్సాహ‌కాలతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు పోసాని తెలిపారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఒక్కటేనని, అందుకే అడిగేందుకు అవకాశం లేకుండా పోయిందని వివరించారు.


పన్ను రాయితీలు


ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ విస్తరణకు అనేక చర్యలు చేపట్టినట్లు పోసాని తెలిపారు. టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, రాజమౌళి వంటి వారితో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ఏపీలో సినిమా షూటింగ్స్ కనీసం 20 శాతం చేస్తే పన్ను రాయితీలు సైతం ఇస్తామన్నారని పోసాని పేర్కొన్నారు. టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించి కూడా ఏపీలో షూటింగ్ చేయాలనే నిబంధన పెట్టినట్లు చెప్పారు.


తరలింపు కష్టమే


తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ లో సినీ పరిశ్రమకు కావాల్సిన భూములిస్తున్నట్లు పోసాని వివరించారు. అక్కడి నుంచి ఒకవేళ చిత్ర పరిశ్రమ ఏపీకి వెళ్తామంటే, తమ భూములు అప్పగించి వెళ్లాలని సీఎం కేసీఆర్ అంటే ఏం చేయగలం అని పోసాని ప్రశ్నించారు. అలా అని పరిశ్రమ ఏపీకి వస్తే మొత్తం తానే చూసుకుంటానని సీఎం జగన్ సైతం చెప్పలేరని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి కదిలించడం కష్టమేనంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.


చంద్రబాబుపై విమర్శలు


ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కుట్ర చేస్తోందని, చంద్రబాబు జైల్లో ఉండి అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 'చంద్రబాబుకి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా.? మరి ఆమె మంచి భోజనం, మందులు పంపట్లేదా.?' అని నిలదీశారు. 


లోకేశ్ పై ఆగ్రహం


కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కలవడంపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మీద రాళ్లు వేయించి ఇప్పుడేమో కేసుల కోసం ఆయన్ను కలుస్తారా.? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, లోకేశ్ లు రాజకీయాలకు పనికి రారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని ఎద్దేవా చేశారు.