టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు (జనవరి 16) పీలేరు సబ్ జైల్లో ఉన్న 8 మంది మైనార్టీ టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లనున్న సందర్భంగా పీలేరులో ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లెక్సీలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. టీడీపీ గుండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఉరుకోవాలా, మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పీలేరులో పలు చోట్ల ప్లెక్సీలు కట్టారు. వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం దృష్ట్యా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రొంపిచర్లలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన కార్యకర్తలను పీలేరు సబ్ జైల్లో చంద్రబాబు పరామర్శించనున్నారు.


భద్రత కట్టుదిట్టం


పీలేరులో చంద్రబాబు నాయుడు పర్యటన వేళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పీలేరు సబ్ జైలుకు చంద్రబాబు చేరుకోనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుండి పీలేరుకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు, భద్రత కట్టుదిట్టం చేసి భారీగా పోలీసులు మోహరించారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, జాతీయనేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి, మాజీమంత్రి అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ నాని, తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ, మదనపల్లి ఇంచార్జ్ దొమ్మలపాటి రమేష్, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌తో పాటు భారీగా టీడీపీ శ్రేణులు పీలేరుకు చేరుకోనున్నారు.


రెండు రోజులుగా చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటుంటే టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టించావు, భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉంటావనుకున్నావు. ఇప్పటివరకూ నా సున్నితత్వాన్ని చూశారు, ఇకపై వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం’ అని చంద్రబాబు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. భోగి పండుగనాడు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 కాపీలను దహనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణాలను చూడలేదని, పోలీసులను సైతం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ అధినేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. పండుగ పూట కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పండుగ పూట కూడా ఏడుపేనా చంద్రబాబు.. చిత్తూరు జిల్లాలోనే కాదు, కుప్పంలోనూ టీడీపీ జెండా పీకి పారేస్తాం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, ప్రజలు తమ వెంట ఉన్నంతవరకు వైసీపీ విజయాన్ని చంద్రబాబు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల పరిపాలనా కాలంలో హంద్రీనీవా పూర్తి చేయలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం వైఎస్ జగన్ సూచనలతో హంద్రీనీవాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై, తనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, కుట్రలు చేసే రాజకీయ నాయకుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.