TDP leader Nallari Kishore Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దీటుగా స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి చంద్రబాబు పై అసూయ, ద్వేషం ఉన్నాయని, అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారని, తన సమకాలీనులైన వాళ్ళు ముఖ్యమంత్రులు కాగా తాను కాలేకపోయానని పెద్దిరెడ్డిలో పేరుకు పోయిందన్నారు. ఆ కారణంతోనే ఆయన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.


మూడు నెలల్లో గద్దె దించుతానని ఉత్తర కుమార ప్రగల్బాలు 
1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా గెలుపు పొందుతున్న చంద్రబాబు నాయుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఉంటే ప్రజలు ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. తన అన్న అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మూడు నెలల్లో గద్దె దించుతానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారని, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మూడున్నర సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని పాలించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసూయ, ద్వేషపూరిత రాజకీయాలకు పెట్టింది పేరని, 2004లో రాష్ట్రంలోని కాంగ్రెస్ వాదులందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కలలు కంటూ ఉంటే పెద్దిరెడ్డి మాత్రం డి.శ్రీనివాస్ కు మద్దతు పలికారని గుర్తు చేశారు.


వైఎస్సార్‌కు పోటీగా పాదయాత్ర చేసిన నేత పెద్దిరెడ్డి 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తే ఆయనకు పోటీగా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేశారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. 2009 నుంచి పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పుంగనూరు అభివృద్ధికి పెద్దిరెడ్డి చేసింది శూన్యమని, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కలికిరి కందూరు రోడ్డును ఇప్పటికి కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కేవలం తన వ్యక్తిగత పనుల కోసమే పెద్దిరెడ్డి రాజకీయాలు సాగిస్తున్నారని, ఏ ప్రభుత్వంలోనైనా ఆయన పనులు నడిపించుకోగల సమర్థుడని ఎద్దేవా చేశారు. పుంగునూరు నియోజకవర్గం లో అత్యధిక శాతం ఉన్న మైనారిటీ ఓటర్లను ప్రలోభ పరచుకొని వారి ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన పెద్దిరెడ్డి, ఇప్పుడు అదే మైనారిటీ వర్గాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.


మైనారిటీ యువకులను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు


అల్లర్లతో ఎటువంటి సంబంధం లేని ఎనిమిది మంది అమాయకపు మైనారిటీ యువకులను కేసుల్లో ఇరికించి వారిని అన్యాయంగా జైల్లో నిర్బంధించారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నమ్మకం ఉంటే ప్రజలు మరోసారి ఆదరిస్తారని, నమ్మకం లేనప్పుడే ప్రతిపక్ష పార్టీలను, ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే ధోరణులకు పాల్పడతారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం కోల్పోయిన పెద్దిరెడ్డి అణిచివేత ధోరణికి పాల్పడుతున్నారని, త్వరలో ప్రజలే తగిన విధంగా గుణపాఠం నేర్పుతారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జోష్యం చెప్పారు.