Why not Fencing in Tirumala Pedestrian Path :
తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి తర్వాత టీటీడీకి ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్స్ లో ఒకటి అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గంలో కంచెను ఏర్పాటు చేయొచ్చు కదా.. ఎందుకు వేయట్లేదని భక్తులు, నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చే తిరుమల వెంకన్న నిధుల కొరతలేంటని మరికొందరి ప్రశ్న. ఇదే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు కూడా గతంలో కొన్ని సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాస్తవానికి తిరుమల నడకమార్గంలో కంచె ఏర్పాటు విషయంలో అవరోధంగా మారుతున్న ప్రధాన అడ్డంకులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. దేశంలోనే మూడో అతిపెద్ద బయో స్పియర్ రిజర్వ్
కేంద్ర ప్రభుత్వం తిరుమల కొండలు ఉన్న శేషాచలం అటవీ ప్రాంతాన్ని దేశంలోనే మూడో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గా గుర్తించింది. అంటే ఇక్కడ ఉండే అడవుల్లో చాలా రకాలైన జీవజాతులు ఉంటాయి. వాటిలో చాలా వరకూ అంతరించిపోయే దశకు వచ్చేసినవి ఉన్నాయి కనుక వాటిని కాపాడాలనే ఉద్దేశంతో శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 8వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్ చేసింది. ఈ ప్రాంతానికి లీగల్ ప్రొటక్షన్ ఉంటుంది. ఏ చిన్న అభివృద్ధి పని చేయాలన్నా చాలా పై స్థాయిలో పర్మిషన్ ఉండాలి. తిరుపతి, రాజంపేట ఫారెస్ట్ డివిజన్స్ తో పాటు తిరుపతి లో ఎస్వీ జూ పార్క్ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కనుక ఇక్కడ బతికే జీవజాతులకు ఆటంకంగా మారే ఏ పనినీ చేపట్టడం అంత సులభం కాదు.
2. వన్యప్రాణుల సంరక్షణ చట్టం - 1972
అడవుల్లో జీవించే వన్యప్రాణుల స్వేచ్ఛ కోసం, వాటి జీవనం కోసం మన రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. 1972లో రూపొందించిన వన్యప్రాణుల సంరక్షణ చట్టం అలాంటిదే. రాజ్యాంగంలో 48ఏ చెప్పేది ఏంటంటే.. రిజర్వు ఫారెస్ట్ (Reserve Forest) లలో వన్యప్రాణుల కదలికలను అడ్డుకోవటం కానీ వాటికి హాని తలపెట్టే విధంగా చర్యలు చేపట్టటం కానీ నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు తిరుమల నడకమార్గంలో కంచెలు ఏర్పాటు చేస్తే అది వన్యప్రాణుల స్వేచ్ఛను హరించటమే. మనకు ఎలా అయితే ఈ సమాజంలో స్వేచ్ఛగా బతికే హక్కు ఉందో అలాగే అడవిలో వన్యప్రాణులకు అన్నమాట.
3. కంచె వేయటం మరింత ప్రమాదకరం
చాలా మంది ఆలోచించని విషయం ఏంటంటే చిరుతల్లాంటి ప్రాణులు చాలా ఎత్తులు కూడా ఎక్కగలవు. 20, 30 అడుగుల చెట్టు పైకి ఎక్కి కొమ్మలపై చిరుత హాయిగా నిద్రపోతుంది. అలాంటిది ఐదు, పది అడుగుల ఎత్తైన కంచెలు చిరుతల్లాంటి జంతువులను ఏ మాత్రం ఆపలేవు. ఒకవేళ కంచె వేసినా అది దూకి కంచెలోపలకి పొరపాటున వస్తే... అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణభయంతో జనాల తొక్కిసలాట, అదే ప్రాణభయంతో ఆ క్రూరమృగం మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. కనుక కంచె వేయడం, గోడలు లాంటివి నిర్మిస్తే అందులో దూరిన చిరుతపులి లాంటి వన్య ప్రాణాలు బయటకు వెంటనే వెళ్లగలిగే అవకాశం ఉండదు కనుక అది మరింత ప్రమాదకరం.
4. జంతువులను జూ కు తరలించటం
మరికొంత మంది చెబుతున్న విషయం చిరుతలు, పులుల వంటి వాటిని బోన్లు పెట్టి పట్టి జూలలో బంధించొచ్చు కదా. అది కూడా కరెక్ట్ కాదు. పులి, చిరుత, సింహం, ఏనుగు ఏ జంతువైనా అది బతికే వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటుంది. కనుక ఆ ప్రాంతం నుంచి మార్చినా..బోనులో పెట్టినా అది బెంగపడి చనిపోవచ్చు కూడా. సైకలాజికల్ గా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి వన్యప్రాణలు.
5. మరి చేయాల్సిందేంటీ
ఇవన్నీ సరే మనిషిగా మన ప్రాణం మరింత విలువైంది కదా అని సందేహం రావచ్చు. నిజమే. అందుకే తగిన జాగ్రత్తలు పాటించాలి. తిరుమల లాంటి ఆలయాలకు రాత్రి వేళల్లో నడిచి వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరే కాకుండా గుంపులుగా వెళ్లటం వలన క్రూరమృగాలు దగ్గరికి రావు. తమకు అపాయం ఉందన్నా, లేదా తమ శక్తి కంటే ఎక్కువ శక్తి ఉన్న జంతువులు, మనుషులు కనిపించినా పులి, చిరుత లాంటివి దాడులకు దిగవు. జంతువులకు ఆహారం పెట్టడం కూడా సరికాదు. వాటంతంట అవే ఆహారాన్ని సమకూర్చుకోగలవు. మనం ప్రేమతో పెడుతున్నాం అనుకున్నా వాటికి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని దూరం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి.
చివరగా ఆహారపదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వలన వాటిని తినేందుకు కుక్కలు, నక్కలు లాంటి జంతువులు వస్తే.. వాటిని తినేందుకు పులులు, చిరుతలు లాంటివి వస్తాయి కనుక అలాంటి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం అని టీటీడీ అధికారులు సూచించారు.