Kuppam Vs Pulivendula Development : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohah Reddy) రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. రిపోర్టులు సరిగా లేకపోతే టికెట్ లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. అందులో భాగంగానే వైనాట్ 175 (Why Not 175) నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యమని జగన్మోహన్ పదే పదే చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu) సైతం వైనాట్ పులివెందుల అంటూ ప్రచారం దూసుకెళ్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబునాయుడు శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు. గెలుపు తమదంటే తమది ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


వైనాట్ కుప్పం టార్గెట్ గా జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...వైనాట్ కుప్పం అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇస్తే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నీళ్లు ఇచ్చారు. చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ...సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. సొంత నియోజకవర్గానికి ఏమైన చేస్తే ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తాయని భావించారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్... కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చి... ఆ తర్వాత కుప్పం మండలాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు.


సొంత నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేయలేకపోయారని...తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని డెవలప్ మెంట్ లో పరుగులు పెట్టించామని జగన్ చెప్పుకుంటున్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయడం కోసం భారీగా నిధులు కేటయించారు. నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ కు అప్పగించారు జగన్. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు.  అందుకే సీఎం జగన్...వైనాట్ కుప్పం అని అంటున్నారు. 


పులివెందులకు నీళ్లిచ్చింది తామేనన్న చంద్రబాబు
2014లో మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు...కొత్త రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. కరవు జిల్లా అయిన అనంతపురంకు కృష్ణ జలాలను తరలించారు. రాయలసీమకు మొట్టమొదటిసారిగా నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అని... గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్వింది ఎన్టీ రామారావేనని చంద్రబాబు గుర్తుచేశారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీల నీటిని సీమకు మళ్లించారమన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ వైనాట్ కుప్పం అంటుంటే...పులివెందులకు న్యాయం చేసింది...నీళ్లు ఇచ్చింది తామేనంటూ చంద్రబాబు నాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. 


ఇద్దరు నేతల పట్టింపులతో ప్రజలకు మంచి
ఇద్దరు నేతల పట్టింపులు...పులివెందుల, కుప్పం ప్రజలకు మంచి చేసిందనే చెప్పుకోవాలి. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పులివెందులకు నీళ్లించారు. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. ఒకరి నియోజకవర్గంపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు డెవలప్ మెంట్ చేస్తున్నా....అల్టిమేట్ గా ప్రజలు మాత్రం లబ్దిపొందారు. రెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచినా...అగ్రనేతల ఛాలెంజ్ లతో సాగునీరు అందించినా...ప్రజలకు మాత్రం పోటాపోటీగా మంచి పనులు చేసి పెట్టారు. ఇదే స్ఫూర్తి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.