Anantapur Uravakonda News ఎన్నికలు వచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావుల కేశవ్ పై.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
‘‘సీఎం జగన్ ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల్లో ఒక్కరైనా ఉండేవారా? ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే.
ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు’’ అని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా’’ అని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు.