Andhra Pradesh Voters List: ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్లు జాబితాను సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు 26 జిల్లాల్లో సేకరించిన ఓటర్లు జాబితా ప్రకారం 24 జిల్లాల్లో మెజార్టీ ఓటర్లు మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి రానున్న ఎన్నికల్లో మహిళలే న్యాయ నిర్ణేతలు కానున్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 4,08,07,256 మంది ఓటర్లు ఉండగా, వీరిలో మెజార్టీ ఓటర్లు మహిళలే ఉన్నారు. మహిళా ఓటర్లు 2,07,29,452 మంది కాగా, పురుష ఓటర్లు 2,00,74,322 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 6,55,1230 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అనేక నియోజకవర్గాల విజయాలను మహిళా ఓటర్లు నిర్ణయించే అవకాశవముంది. గతంతో పోలిస్తే మహిళా ఓటర్లు సంఖ్య పెరగడం ఆనందకరమైన విషయంగా అధికారులు భావిస్తున్నారు. వీరిని పోలింగ్ కేంద్రాల వరకు వచ్చేలా చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
రెండు జిల్లాలు మినహా..
జిల్లాలు వారీగా ఓటర్లను పరిశీలిస్తే మొత్తం 26 జిల్లాల్లో 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 9,92,397 మంది మహిళ ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,83,640 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. తుది ఓటర్లు జాబితా ప్రకారం పరిశీలిస్తే ప్రతి వేయి మంది ఓటర్లకుగాను మహిళా ఓటర్లు 1036 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతి వేయి మంది జనాభాకు 722 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 729 కాగా, ఈసారి స్వల్పంగా తగ్గింది. ట్రాన్‌జెండర్ ఓటర్లు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్‌జెండర్ ఓటర్లు 3,482 మంది ఓటర్లు ఉండగా, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 312 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలో అత్యల్పంగా 17 మంది ఉన్నారు.
రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన ఓటర్లు..
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గతంలో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 3,94,05,967 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన తుది జాబితాలో 4,08,07,256కు చేరింది. సర్వీసు ఓటర్లు రాస్త్రంలో 67,434 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు జాబితాలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 283 మంది సర్వీస్ ఓటర్లతో చివరి స్థానంలో ఉంది. ముసాయిదా జాబితా నుంచి 16,52,422 ఓట్లు తొలగించారు. వీరిలో మృతుల సంఖ్య 5,84,810 కాగా, వలస ఓట్లు 8,47,421గా ఉన్నాయి. రిపీటెడ్ ఓట్లు 2,20,191 ఉన్నాయి. నామినేషన్లు వేసేంత వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది.