AP Congress PCC Chief Sharmila Effect: ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ఎంట్రీ కొత్త లీడర్ల ను ఎంత ఆకర్షిస్తుందో.. సీనియర్ లీడర్లలో కొందరికి మాత్రం ఇబ్బందికరంగానే మారింది. ముఖ్యంగా షర్మిల రాకను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సీనియర్‌లలో కొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. వారిలో హర్ష కుమార్ ఒకరు. ప్రస్తుతానికి అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించి షర్మిల వెంట నడుస్తామని అంటున్నా తన దారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఆయన. 


వచ్చే నెల 8న రాజమండ్రి లో దళిత సింహ గర్జన ఏర్పాటు
ఏపీ కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్ ఆయ్యే అన్ని అర్హతలున్నా అధిష్ఠానం ఆ దిశగా ఆలోచించక పోవడం హర్ష కుమార్‌ను తీవ్రంగా కలచి వేసింది అంటారు ఆయన సన్నిహితులు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా అమలాపురం నుంచి గెలిచారు ఆయన. అయితే రాష్ట్ర విభజన తరువాత , పదేళ్లుగా ఎంపీ పదవికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈసారి ఎలాగైనా మరోసారి ఎంపీ అయి తీరాలని పట్టుదలతో ఉన్నారు హర్ష కుమార్. దీని కోసం ముందు నుంచే తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. రాజమండ్రి లో వచ్చేనెల 8న  భారీ ఎత్తున దళిత సింహ గర్జన సభ కూడా జరుపనున్నారు. దానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దళితులు, హర్ష కుమార్ అభిమానులు హాజరవుతున్నారు. 


పదేళ్లు పదవికి దూరంగా ఉన్నా ఎగ్రేసివ్ లీడర్‌గా హర్షకుమార్ ఇమేజ్ ఇంకా ఎఫెక్టివ్‌గానే ఉంది. అందుకే మరోసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. అయితే దానికంటే ముందు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అన్న విషయాన్ని తన అభిమానులకు చెప్పి ఆ తరువాత బహిరంగ ప్రకటన చెయ్యాలని అనుకున్నారు. అయితే ఈ లోపు షర్మిలను  పార్టీ పీసీసీ చీఫ్‌గా ప్రకటించింది కాంగ్రెస్ హై కమాండ్. దీనితో తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు  హర్ష కుమార్.


మొదటి నుంచీ  వైఎస్ రాజశేఖర రెడ్డితో ఢీ అంటే ఢీ
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి మొదటి నుంచీ హర్ష కుమార్‌తో సఖ్యత ఉండేది కాదు. హర్ష కుమార్‌కు సీటు ఇవ్వకూడదని ఆయన అడ్డుపడినా హర్ష మాత్రం డైరెక్ట్ హై కమాండ్‌తో టచ్‌లో ఉండేవారు. చివరకు రాజశేఖరరెడ్డి మాటను కాదని సైతం హర్ష కుమార్‌కు ఎంపీ సీటు ఇచ్చింది. అమలాపురం తనకు కొత్త నియోజక వర్గమైనా.. వైఎస్సార్ సహకారం లేకపోయినా హర్ష కుమార్ ఒకటికి రెండుసార్లు గెలిచారు. వైఎస్ఆర్ అకాల మరణం.. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడం ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో సమైక్యవాదం నినాదంతో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఆ తరువాత అనూహ్యంగా 2019లో టీడీపీలో చేరారు కానీ అమలాపురం ఎంపీ టికెట్ దక్కక పోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.


కొంతకాలంగా హై కమాండ్ పై అలక
ఏపీ పీసీసీ పదవి ఆశించిన హర్ష కుమార్ అది కాస్త గిడుగు రుద్రరాజుకు ఇచ్చి తనను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌ను చెయ్యడంతో నిరాశకు చెందారు. తనకే పదవీ వద్దని దళితులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని చెప్పి సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని తెలిపారు. అప్పటి నుంచే బయటకు రావాలని ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయన తాజాగా షర్మిల పీసీసీ చీఫ్ కావడంతో వాటిని మరింత స్పీడప్ చేశారు.


అమలాపురం ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన టీడీపీ
2019 ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీ ప్రస్తుతం గెలుపు గుర్రాల వైపు చూస్తోంది. అలాగే అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని దీటుగా ఎదుర్కొని నెగ్గుకు రాగల నేతలూ టీడీపీకి ప్రస్తుతం అవసరం. ఈ కారణంగా అమలాపురంలో ఎంపీగా పోటీ చెయ్యడానికి హర్ష కుమార్ బెటర్ అనే ఆలోచనలో ఉంది. హర్ష కుమార్ కొరింది కూడా అదే కావడంతో హర్ష కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అభిమానులకు కార్యకర్తలకు తెలియజేయడానికి ఫిబ్రవరి 8న రాజమండ్రిలో జరిగే దళిత సింహ గర్జన సభను వేదికగా చేసుకో బోతున్నారు హర్ష కుమార్. ప్రస్తుతం ఆయన కుమారుడు శ్రీ రాజ్ ఆ సభకు విజయవంతం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.