నేడు నిర్వహించాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని వాయిదా వేసిన టీటీడీ..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాకపోవడంతో తాత్కాలికంగా రద్దు
తదుపరి తేది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల అనంతరం టీటీడీ వెల్లడించే అవకాశం..
TTD Postponed Kalyanamasthu: టీటీడీ కళ్యాణమస్తుకు తాత్కాలికంగా బ్రేకులు పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు రాక పోవడంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిర్వహించాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్ధికంగా భారమై ఇబ్బందులు పడుతున్న వారి కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వివాహం చేసుకునే అదృష్టాన్ని టీటీడీ కళ్యాణమస్తు ద్వారా పేదవారికి అందిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో కొన్ని వందల జంటలు కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా ఒక్కటయ్యే అవకాశం ఉంది.
సామూహిక వివాహాలు వాయిదా
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలను జరిపేందుకు టీటీడీ ముహూర్తం సైతం ఖరారు చేసింది. నేడు (ఆగస్టు 7వ తేదీ) ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారు. అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చని స్వయంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేశారు.
కళ్యాణమస్తు తాత్కాలికంగా ఎందుకు రద్దు..
2021వ సంవత్సరంలోనే టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో కళ్యాణ వేదికలను సైతం సిద్ధం చేసింది. పదేళ్ల అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపం లేకుండా జయప్రదం చేయాలని నిశ్చయించుకుంది. గతేడాది మే 28 మధ్యాహ్నం 12.34 నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు ముహూర్తాలు ఖరారు చేశారు. ఇంతలో కరోనా మరోసారి వ్యాప్తి కావడంతో కార్యక్రమం వాయిదా పడింది. ఇక పూర్తి స్ధాయిలో కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమంను పునఃప్రారంభించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగ్గ ముహూర్తం సైతం వేద పండితులు ఖరారు చేయడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని స్వయంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని ప్రకటించారు. అయితే రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమంకు ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లా అధికారులతో సమన్వయంతో అవసరం అయ్యే ఏర్పాట్లను సిద్దం చేసింది. కళ్యాణమస్తు కార్యాక్రమంలో వివాహం చేసుకోవాలని భావించిన పేదల పిల్లలు అప్లై చేసుకున్నారు. అయితే కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సి అనుమతులు రాక పోయే సరికి కళ్యాణమస్తు కార్యక్రమంను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకూ తదుపరి కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహణ తేదీని టీటీడీ ఖరారు చేయనుంది.