Rathasapthami in Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. సూర్యప్రభ వాహనంతో మొదలైన ఈ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధుల్లోకి చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్య ప్రభామధ్యస్తుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనం ఇచ్చారు.
సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్య నారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలూ పేర్కొంటున్నాయి.
శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక యాప్..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను అప్ డేట్ చేసింది. ఇది వరకు ఉన్న "గోవింద" యాప్ నే టీటీ దేవస్థానమ్స్(TT Devasthanams) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో ప్లాట్ ఫామ్ ద్వారా ఈ యాప్ ను అభివృద్ధి చేసినట్లే టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. యాప్ లో తిరుమల చరిత్ర స్వామి వారి కైంర్యాల వివరాలను పొందుపరిచినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే గోవింద యాప్ ను తమ మొబైళ్లలో కల్గి ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి "టీటీ దేవస్థానమ్స్"ను అప్ డేట్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. కొత్త వారు నేరుగా టీటీ దేవస్థానమ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని వివరించింది.