ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ఏపీ ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 7 ఎంపీపీ అధ్యక్షులు, 11 ఎంపీపీ ఉపాధ్యక్షులు, 6 కోఆప్టెడ్ సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 3న ఈ ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నిక నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వీటితో పాటు జనవరి 30వ తేదీలోగా మండల పరిషత్ ప్రత్యేక సమావేశం కోసం నోటీసు జారీ చేయాల్సిందిగా తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలు ఇవే.. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల, ఎన్టీఆర్ జిల్లా లోని గంపలగూడెం, నెల్లూరు జిల్లాలో జలదంకి, తిరుపతిలోని చిల్లకూర్, చిత్తూరు, కర్నూలు జిల్లా మడికెరలో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఎస్.రాయవరం, పిడుగురాళ్ల, సంతమాగులూరు, ఆలూర్, విడపనకల్లు, చెన్నేకొత్తపల్లి మండలాల అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది.
2021 సెప్టెంబర్ లో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వివిధ కారణాల వల్ల 8 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం 652 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల సమయంలో 11 మంది అభ్యర్థులు మృతి చెందారు. చివరిగా 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఎన్నికల జరిగాయి. ఈ స్థానాల్లో 2,058 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం 9,672 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ అనంతరం 81 మంది అభ్యర్థులు మృతి చెందగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 18,782మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
కర్నూలు జిల్లాలో 36 జడ్పీటీసీలకుగాను 35 జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆ 35 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఆదోని, ఆలూరు, పెద్ద కడుబూరు, ఆస్పరి, హాలహర్వి, దేవనకొండ, మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, గోనెగండ్ల, నందవరం, ఆత్మకూరు, సి బెళగాల్, గూడూరు, కోడుమూరు, ఓర్వకల్, వెలుగోడు, మహానంది, సిరివెళ్ల, కౌతాళం, ఎమ్మిగనూరు, మిడ్తూరు, కల్లూరు, గడివేముల దొర్నిపాడు, కొత్తపల్లి, నందికొట్కూరు, జూపాడు బంగ్లా, పగిడ్యాల,పాములపాడు,ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, పాణ్యం,వెల్దుర్తిలో వైఎస్సార్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపొందారు.