ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా సహా ఇతర కోటాలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖ వ్యక్తులను సభ్యులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ సభ్యులను ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వారు టీటీడీ సభ్యులుగా ఉండేందుకు అనర్హులు అని విమర్శించారు. తాజాగా టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు అయింది. 


ప్రభుత్వం ఎంపిక చేసి నియమించిన వారిలో కొందరికి నేర చరిత్ర ఉందని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. నేర చరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో కోరారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడి పడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.


టీటీడీ పాలక మండలి సభ్యులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 25) ప్రకటించింది. వారి జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యుల్లో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురికి అవకాశం దక్కింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి అవకాశం దక్కింది.


గోదావరి జిల్లాల నుంచి ఉంగుటూరుకు చెందిన గడిరాజు వెంకట సుబ్బరాజు, ఏలూరుకు చెందిన నెరుసు నాగ సత్యం యాదవ్‌, ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా వీరవెంకట సుధీర్‌ కుమార్‌ (శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, మంత్రాలయం నుంచి ఎల్లారెడ్డిగారి సీతారామి రెడ్డి, అనంతపురం నుంచి పెనక శరత్‌ చంద్రారెడ్డి, అశ్వద్థనాయక్‌ కు చోటు దక్కింది.


అలాగే ఇతర రాష్ట్రాల కోటాలో తెలంగాణ నుంచి గడ్డం సీతా రంజిత్‌రెడ్డి(ఎంపీ రంజిత్‌ రెడ్డి భార్య), తమిళనాడు నుంచి డాక్టర్‌ ఎస్‌. శంకర్‌, కృష్ణమూర్తి వైద్యనాథన్‌, కర్ణాటక నుంచి ఆర్‌వీ దేశ్‌పాండే, మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్‌ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు.


ఎమ్మెల్యే కోటాలో సభ్యులు వీరు
1. పొన్నాడ వెంకట సతీశ్ కుమార్
2. సామినేని ఉదయభాను
3. ఎం. తిప్పేస్వామి


ఇతర సభ్యులు
4. సిద్దవటం యానదయ్య
5. చందే అశ్వర్థ నాయక్
6. మేకా శేషుబాబు
7. ఆర్. వెంకట సుబ్బారెడ్డి
8. ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి
9. గాదిరాజు వెంకట సుబ్బరాజు
10. పెనాక శరత్ చంద్రా రెడ్డి
11. రామ్ రెడ్డి సాముల
12. బాలసుబ్రహ్మణియన్ పళనిసామి
13. ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి
14. శ్రీమతి గడ్డం సీతారెడ్డి
15. క్రిష్ణమూర్తి వైద్యనాథన్
16. సిద్దా వీర వెంకట సుధీర్ కుమార్
17. సుదర్శన్ వేణు
18. నేరుసు నాగ సత్యం
19. ఆర్‌వీ. దేశపాండే
20. అమోల్ కాలే
21. డాక్టర్ ఎస్. శంకర్
22. మిలింద్ కేశవ్ నర్వేకర్
23. డాక్టర్ కేతన్ దేశాయ్
24. బోరా సౌరయ్య