Tirumala Tirupati Ghat Road: శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డుపై బైకర్ల రాకపోకలపై కొద్ది రోజులు ఆంక్షలు విధించారు. ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి వెంటనే అమలులోకి వస్తుందని ఓ ప్రకటన విడుదల చేసింది.
టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన విధంగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్లు దాటుతున్నాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను మొదటి, రెండవ ఘాట్ రోడ్‌లలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కాబట్టి, భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
వరలక్ష్మీ వ్రతం కరపత్రాలు విడుదల చేసిన శ్యామలరావు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జరగనున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం (ఆగస్టు 12) టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుందని చెప్పారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.