తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ పౌర్ణమి సేవ వైభవంగా సాగింది.. మంగళవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. గరుడ వాహనసేవ రాత్రి 9 గంటల వరకూ కన్నుల పండుగగా సాగింది.. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు మంగళ హారతులు పలికారు.. మలయప్ప స్వామి వారు ఇష్ట వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించడంతో తిరుమాఢ విధులు గోవిందుని నామ స్మరణతో మారుమోగాయి.
గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.