TTD News: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు తమకు తోచినంత విరాళం అందిస్తుంటారు. హుండీకి సైతం భారీగా ఆదాయం వస్తుంటుంది. ఇటీవలే ముస్లిం దంపతులు శ్రీవారికి కోటి రూపాయల భారీ విరాళం అందించగా... నేడు ఓ మహిళా భక్తురాలు 70 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని విరాళంగా ఇచ్చారు. తమిళనాడుకు చెందిన భక్తురాలు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తిరుమల శ్రీనివాసుడికి సోమవారం సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తిని టీటీడీకి విరాళంగా అందించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలూకా కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు శ్రీమతి ఎన్.కె.నెమావతి కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటి విలువ సూమారు రూ.70 లక్షలు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని టీటీడీ ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జునకు ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు. అనంతరం ఆ భక్తురాలికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు.


ఇటీవల ముస్లిం దంపతులు కూడా బాలాజీకి విరాళం


చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘ‌నీ ముస్లిం దంప‌తులు తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్నారు. తమ పిల్లలతో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ. 1.02 కోట్లు విరాళంగా అందించారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు విరాళం చెక్కును అందించారు. ఇందులో రూ. 15 లక్షలను ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని, మిగతా రూ.87 లక్షలను తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌ కోసం, వంట‌శాల‌లో పాత్రల‌కు ఉపయోగించాలని టీటీడీ ఈవోను కోరారు.


రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారీ విరాళం


ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.