TTD EO Shyamala Rao Takes Charge | తిరుమల: టీటీడీ ఈవోగా జే. శ్యామల రావు బాధ్యతలు స్వీకరించారు. పవిత్ర తిరుమల దేవాలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో (TTD EO)గా ఉన్న ధర్మారెడ్డిపై కూటమి ప్రభుత్వం ఇటీవల వేటు వేసింది. వైసీపీ ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ధర్మారెడ్డిని తప్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO)గా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (AP CS) నీరభ్ కుమార్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు.


తిరుమల హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం 
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామల రావు (1997 ఐఏఎస్ బ్యాచ్) తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తిరుమల హిందువుల (Tirumala Temple)కు పవిత్ర పుణ్యక్షేత్రం అని, ప్రతిరోజూ దేశంలోని నలుమూలలతో పాటు ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రతి రోజూ 70 నుంచి 80 వేల వరకు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అందుకే ఈ పవిత్ర తిరుమల దేవాలయానికి ఈవోగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవుడు ఆశీస్సులతో టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై ఎంతో నమ్మకంతో టీటీడీకి ఈవోగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


పారదర్శకత, నిబద్ధతతో టీటీడీకి సేవలు
‘తిరుమలకు సంబంధించిన ఇకపై ఏ కార్యక్రమం చేపట్టినా ఎకౌంటబిలిటీ , పారదర్శత ఉండేలా చూసుకుంటా. తిరుమల టెంపుల్ తో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. తిరుమలకు భక్తులు వస్తే గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటా. 24x7 భక్తుల సేవలో ఉన్న ఉద్యోగులు పై దృష్టి పెడతాం. టీటీడీ చేస్తున్న సేవా కార్యక్రమాల మరింత జరిగేలా చూసుకుంటాం. పదవి విరమణ చేసిన ఉద్యోగం చేస్తున్న వారి ని పరిశీలించి టీటీడీకి ఎవరు అవసరం, ఎవరు అనవసరం అనేది పరిశీలిస్తాం. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు భక్తులు చూసుకునేలా తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాం. అన్ని శాఖలను రివ్యూ చేసి ఏమైనా సమస్యలుంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కారిస్తామని’ టీటీడీ నూతన ఈవో శ్యామలరావు చెప్పుకొచ్చారు.  


ధర్మారెడ్డిని తొలగించి శ్యామలరావుకు బాధ్యతలు


ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేస్తున్న జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి, శ్యామలరావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఏవి. ధర్మారెడ్డిని వెంటనే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ, టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల నుంచే చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. 


Also Read: జూన్ 17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు