Bhumana  Karunakar Reddy: యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సూచించారు. భూమన కరుణాకర రెడ్డి దంపతులు మంగళవారం రుషికేష్‌లో స్వరూపానంద స్వామిని గౌరవపూర్వకంగా కలిశారు. స్వామికి శ్రీవారి ప్రసాదాన్ని అందించి శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ  సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ చైర్మన్‌కు పలు సూచనలిచ్చారు. భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్‌గా నడకదారిని అభివృద్ధి చేయాలని సూచించారు. 


ప్రభుత్వం మంజూరు చేసిన 700 వేద పారాయణదారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ధర్మ ప్రచారం మరింత విస్తృతం  చేయాలని చెప్పారు. వసతి గదుల కొరతను త్వరితగతిన అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైనులో వేచి ఉన్న భక్తులు అందరికీ అన్నప్రసాదాలు అందేలా చూడాలన్నారు. శ్రీవారికి సమర్పించే కైంకర్యాలపై ఎప్పటికపుడు సమిక్షించాలని సూచించారు. 
  
యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలని, గిరిజన, దళిత ప్రాంతాల్లో భజన బృందాలకు సామగ్రి అందించాలని సూచించారు. భజన, కోలాటం బృందాలకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు.  అనంతరం కరుణాకర రెడ్డి దంపతులను స్వరూపానందేంద్ర స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామిని టీటీడీ చైర్మన్ దంపతులు శాలువాతో సన్మానించారు.


ఆగస్టు 24, 25వ తేదీల్లో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు
శ్రీ  వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 24, 25వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల నుంచి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.


తిరుప‌తిలో...
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 24వ తేదీన ఉదయం 9 గంట‌లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 గంటల‌కు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల‌కు సంగీత స‌భ‌,  ఉద‌యం 11.30 గంట‌ల‌కు హ‌రిక‌థ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని తిరుమలలో హోమాలు
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జన్యశాంతి హోమాల‌కు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాయశ్చిత్త హోమం, అంకురార్పణ చేపట్టారు. ఆగస్టు 26వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరి రోజు మ‌హాపూర్ణాహుతి నిర్వహిస్తారు.


టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల శ్రీవారికి మంగళవారం క్వాంటం ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఎండీ చక్రవర్తి విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనం ధర రూ.1,18,276 ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను తిరుమల డీఐ జానకీరామ్ రెడ్డికి అందజేశారు.