TTD News: సీఎం జగన్‌తోపాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై తిరుమల దేవస్థానం చర్యలు తీసుకుంది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయించింది. అన్నమయ్య భవన్‌లో సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో రమణ దీక్షితులపై చర్యలు కూడా ఉన్నాయి. 


వారం రోజుల క్రితం రమణ దీక్షితులు సీఎం జగన్, టీటీడీ అధికారులు, అహోబిలం మఠం, జీయర్‌లపై చేసిన కామెంట్స్‌ సంచలనం రేపాయి. దీనిపై చర్చించిన పాలక మండలి రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 


తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు వారం రోజుల క్రితం చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయింది. దీన్ని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 


వైరల్ అయిన వీడియోలో రమణ దీక్షితులు ఏమన్నారంటే... టీటీడీలో చాలా మంది క్రిస్టియన్‌లు ఉండటమే పెద్ద సమస్య అని ఈఓ ధర్మారెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డి క్రిస్టియన్ అని అన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని అన్నారు. అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో నిధులు ఉన్నాయని వాటిని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని ఆరోపించారు. జియ్యర్‌లు ధర్మారెడ్డికి సాస్టాంగ పడతారన్నారు. అలా చేయకపోతే మూడు, నాలుగు కోట్ల నిధులను నిలిపివేస్తారని అన్నారు. తిరుమల కిచెన్‌లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు రమణ దీక్షితులు. గుట్కా ప్యాకెట్‌లు అన్నీ చింపి బయట పోస్తుంటారని తెలిపారు. అందరినీ మ్యానేజ్ చేస్తుంటారు. దర్శనానికి వచ్చే జడ్జిలు, మినిస్టర్లు, ఆడిటర్‌లు, ఇలా అందరినీ మేనేజ్ చేస్తారని అన్నారు. శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రమణ దీక్షితులు. 


ఈ వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. దీన్ని లీడ్‌ తీసుకున్న రామచంద్రయాదవ్‌ కేంద్రానికి లేఖ రాశారు. తిరుమలలో కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని గుప్త నిధుల తవ్వకాల అంశం కూడా తెరపైకి రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యక్రమాలు ఉన్నాయని అమిత్‌షాకు రాసిన లెటర్‌లో పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.


కామెంట్స్‌ను ఖండించిన రమణ దీక్షితులు


వీడియో వైరల్‌ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్‌ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో ఉన్న తనకు సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి తానంటే అసూయని చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. అయినా ప్రభుత్వం ఆయన ఖండనను పరిగణలోకి తీసుకోలేదు.