Tirupatis birthday to be observed on February 24: తిరుపతి: పుట్టిన రోజు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పండుగ రోజు లాంటిది. సాధారణంగా మనుషులు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. చిన్నా పెద్దా అనే వ్యత్యాసం లేకుండా ఎవరికి తోచినట్లు వాళ్లు బర్త్ డే జరుపుకుంటారు. కొందరు వారి పెంపుడు జంతువులకు సైతం పుట్టినరోజు వేడుకలు జరపడం తరచుగా వింటూనే ఉంటాం. అలాంటిది ఒక గ్రామానికో... పట్టణానికో పుట్టిన రోజు చేయడం ఎప్పుడైనా చూశారా. అయితే ఈ స్టోరీ మీకోసమే...
ఆధ్యాత్మిక నగరం తిరుపతి 1130 ఫిబ్రవరి 24న ఆవిర్భవించింది. భగవాన్ రామానుజాచార్యుల వారు తిరుపతిలో ఆ రోజున శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించారు. స్వామివారి కైంకర్యాల నిర్వహణ, నాలుగు మాడవీధులతో నిర్మాణం ప్రారంభించారు. మొదట్లో తిరుపతి అని పేరు లేదు. తొలుత గోవిందరాజ పట్టణంగా వ్యవహరించేవారు. దీనిని రామానుజచార్యుల వారు ఏర్పాటు చేశారని, ఆయన పేరిట రామానుజపురంగా పిలిచేవారు. కాలక్రమేనా 13వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ఆధ్యాత్మిక నగరాన్ని తిరుపతిగా పిలుస్తున్నారు.
కలియుగ దైవం కొలువుదీరిన తిరుపతి నగరం 894వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంది. తమిళంలో తిరుమలై అంటే పవిత్రమైన కొండ అని అర్థం.. పట్టి అంటే కింద ఉన్న ప్రాంతం.. అలా తిరుమల కొండ కింద ఉన్న ప్రాంతం కనుక తిరుపట్టిగా వ్యవహరించేవారు. కాలక్రమేణ భక్తులు, ప్రజలు తిరుపతిగా పిలుస్తున్నారు.
ప్రతి ఏడాది తిరుపతి ఆవిర్భావ వేడుక నిర్వహిస్తాం: టీటీడీ ఛైర్మన్ భూమన
తిరుపతి: తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తూ, పాలక మండలిలో తీర్మానిస్తాం అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) చెప్పారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం టీటీడీ ఆధ్వర్యంలో మన తిరుపతి ఆవిర్భావ వేడుక నిర్వహిస్తామని పేర్కొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా న భూతో న భవిష్యత్ అనేలా జరిగాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా తిరుపతి ప్రజలందరూ కూడా వేనోళ్ల స్వాగతించారని చెప్పారు. తిరుపతి పట్టణ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా మలిచాం. కచ్చితంగా ఇకమీదట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా మారడానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
పరమ పూజ్యులైన జగద్గురువులు శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య హస్తాలతో ప్రారంభించిన తిరుపతి నగరం 894 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పండుగని ఇంత అద్భుతంగా నిర్వహించు కోవడం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండటం వల్లే జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల యంత్రాంగమంతా ఈ వేడుకకు కదలి వచ్చింది. వేద పండితుల వేద ఘోషతో నాలుగు వీధుల్ని పావనం చేశారు. కళాకారుల అద్భుత విన్యాసాలతో తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేలా మురిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఏ తప్పులు చేయకుండా ప్రపంచానికి ఈ నగరం ఓ ఆదర్శ నగరం కావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు.