AP Elections 2024: తిరుపతి: టీడీపీ, జనసేన తొలి అభ్యర్థుల జాబితాపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలని మంత్రి రోజా (AP Minister Roja) డిమాండ్ చేశారు. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? 24 సీట్లకే తోక ఊపుకుంటూ చంద్రబాబు(Chandrababu)తో పోత్తు పెట్టుకున్నావ్ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదు 
పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలన్నారు. మరోవైపు 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు ఉన్నారని రోజా అన్నారు. ఏపీ సీఎం జగన్ ను ఒంటరిగా ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు. వాళ్లలో వాళ్లకే గందరగోళం, ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారని చెప్పారు.


టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు 
టీడీపీ, జనసేన కలిపి 118 స్థానాలను ప్రకటించారు. అందులో టీడీపీకి 94 సీట్లు కేటాయించగా, జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో ఎందుకు చెప్పలేదని మంత్రి రోజా ప్రశ్నించారు. ఎందుకంటే ఒక్క స్థానంలో ఒడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఒడిపోయినవారికి రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలంటూ సెటైర్లు వేశారు.


జనసేనకు కీలకమైన స్థానాలు 
ఏపీ ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు కీలకమైన స్థానాలు లభించాయి. ఇందులో చాలా చోట్ల టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పొత్తు ధర్మలో భాగంగా సీట్లు కేటాయించింది. మొదటి జాబితాలో 118 సీట్లలో టీడీపీకి 94 సీట్లు, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేనకు లభించిన స్థానాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది.  


) నెల్లిమర్ల- మాధవి 
2) అనకాపల్లి- కొణతాల రామకృష్ణ 
3) కాకినాడ రూరల్-  పంతం నానాజీ  
4) తెనాలి- నాదేండ్ల మనోహర్ 
5) రాజానగరం - బత్తుల బలరామకృష్ణ


తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన తొలి జాబితాను పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించ లేదన్న విషయం అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎండాడ వైసిపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారో ఈ రెండు పార్టీలు ఆత్మ  పరిశీలన చేసుకోవాలని అన్నారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతామని, అదే జనసేన, టీడీపీ పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు.


తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కలర్ వేసుకుని తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం  24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో  ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు.  గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏఏ మేళ్లను చేసిందో ధైర్యంగా చెప్పి ఓటు అడుగుతారని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తను ఫలానాది చేశానని చెప్పుకునే ధైర్యం లేదని అమర్నాథ్ విమర్శించారు.