TIRUMALA NEWS: టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగష్టు 27వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.


సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్యాల రంగవల్లికలతో తీర్చిదిద్దుతున్నారు.


ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవు


       గోశాలకు విచ్చేసే భక్తులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం. కావున టిటిడి సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.


ప్రత్యేక కార్యక్రమాలు 
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.


తిరుమలలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం


తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.


ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ  ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.